పోలవరం చుట్టూ ఏపీ రాజకీయాలు ఇపుడు తిరుగుతున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే పోలవరం కాదు, గరం గరం గా మారింది. నీళ్ళు ఇవ్వాల్సిన  పోలవరం ఇపుడు  నిప్పులు చిమ్ముతోంది. పోలవరం విషయంలో కేంద్రం దాదాపుగా తప్పుకుంది. ఈ మాట అంటే బీజేపీ నేతలకు కోపం రావచ్చునేమో కానీ ఆరేళ్ల క్రితం నాటి అంచనాలకే డబ్బులు చెల్లిస్తామని చెప్పడం కంటే దారుణం ఉంటుందా. నిన్నటికీ నేటికీ ధరలు అన్ని రకాలుగా పెరిగాయి. కేంద్రం కూడా ఎన్నో పధకాలు చేపడుతోంది. మరి పాత అంచనాలే అని పట్టుకుని కూర్చుంటే ఏదైనా ముందుకు కదిలేనా. అయ్యే పనేనా. మొత్తానికి చూసుకుంటే పోలవరం విషయంలో బీజేపీ పెద్దలు  కుండబద్దలు కొట్టేశారు.

ఒక విధంగా బీజేపీది రాజకీయ గడుసుదనం. తమకు నాలుగు ఓట్లు వస్తాయనుకుంటే అక్కడ కోట్లు కుమ్మరించడానికి వెనకాడదు, ఏపీలో తమను నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. పైగా వస్తే జగన్ లేకపోతే చంద్రబాబు మాదిరిగా ఏపీ రాజకీయం ఉంది. బీజేపీకి కనీసం స్పేస్ లేదు. రేపటి రోజున వస్తామన్న ఆశ అంతకంటే లేదు. మరి అలాంటపుడు ఎందుకు కోట్లు నిధులు ఇస్తుంది.

అదే సమయంలో ఏపీలో రాజకీయ వాతావరణం కూడా బీజేపీకి కలసివస్తోంది. ఇక్కడ బాబు జగన్ ఇద్దరూ బీజేపీని పల్లెత్తు మాట అనరు. వీరి మధ్య శత్రుత్వం కారణంగా రెండు పార్టీలు జై మోడీ అంటాయి. అందువల్ల పైసా విదల్చకున్నా ఏపీలో రాజకీయంగా కొంపలు అంటుకోవు. అదే తమిళనాడు అయితే తమ రాష్ట్ర ప్రయోజనాల‌ కోసం పార్టీలన్నీ కలసి కేంద్రం మీద దండెత్తుతాయి. అందుకే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తమిళనాడుకు ఒక్క పైసా కూడా బాకీ ఉండదంతే.

ఇపుడు ఏపీలో ఉన్న రాజకీయం ప్రకారం చూస్తే పోలవరం విషయంలో కేంద్రం నుంచి ఆశించడం తప్పే. జగన్ సీఎం గా ఉన్నారు కాబట్టి తప్పో ఒప్పో ఆయనే ఈ  భారాన్ని నెత్తిన మోయాలి. ఒకటి రెండూ కాదు, ఏకంగా ముప్పయి అయిదు వేల కోట్లు అప్పులు చేసైనా పోలవరాన్ని పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తేనే జగన్ కి, వైసీపీకి రాజకీయ భవిష్యత్తు. మొత్తానికి పోలవరం జగన్ కి వరమో శాపమో కాలం తేల్చాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: