ఎన్నికలు అంటేనే ఒక ఆట. అలాంటి ఇలాంటి ఆట కాదు, గెలిచి తీరాలంటూ వేసే ఎత్తుల జిత్తుల సయ్యాట. చేతిలో ఉన్న పావులు ఒక్కోసారి కదలకుండా పోతాయి. మరోసారి అవే పనిచేస్తాయి. విషయానికి వస్తే టీయారెస్ అంటూ రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీకి కర్ణుడి కవచ కుండలాల మాదిరిగా ఒక ట్రంప్ కార్డ్ కూడా అలా వెంట వచ్చేసింది. అదే బలమైన అస్త్రంగా మారి ప్రత్యర్ధుల మీద వేసేందుకు తాము గెలిచేందుకు ఉపయోగపడుతోంది.

ట్రంప్ కార్డ్ పేరే తెలంగాణా సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకునే ఇప్పటికీ ఎన్నో ఎన్నికలను అలవోకగా కేసీయార్ గెలుస్తూ రాజకీయ యోధ అనిపించుకున్నారు. 2018  ముందస్తు ఎన్నికల్లో అంతా కేసీయార్ సర్కార్ ఓడిపోతుందని భావించారు. కానీ కేసీయార్ అపుడు కూడా అర్జంటుగా తీసి వాడింది ఇదే ట్రంప్ కార్డు. చంద్రబాబు కాంగ్రెస్ దోస్తీని చూపించి ఆంధ్రుల చేతికి మళ్ళీ పాలన అంటూ ఆయన చేసిన హడావుడి, తెలంగాణా సెంటిమెంట్ అంటూ ప్రయోగించిన ట్రంప్ కార్డ్ కి మొత్తానికి మొత్తం ఓట్లు వచ్చి  అలా ఈవీఎం మిషన్లలో పడిపోయాయి అంతే.

కానీ ఆ ట్రంప్ కార్డ్ వల్ల ఉపయోగం ఏమీ లేదని దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రుజువు చేసింది. అక్కడ జరిగిన ఎన్నిక చూసుకుంటే అభివృద్ధి, కుటుంబ పాలన, అవినీతి ఇలాంటి విషయాల మీదనే తిరిగింది. దాంతో టీయారెస్ కి అక్కడ ఓటమి తప్పింది కాదు. ఇపుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు చూసుకుంటే అదే జరుగుతోంది. తెలంగాణా సెంటిమెంట్ కార్డ్ అసలు ఇక్కడ పనిచేయదు. దాని ఊసే ఇపుడు లేదు. దానికి తోడు బీజేపీ కొత్త అజెండా సెట్ చేసి పెడుతోంది.

కొత్త కార్డ్ పట్టుకుని దడ పుట్టిస్తోంది. మత రాజకీయాలు అంటోంది. రోహింగ్యాలు అంటోంది. హైదరాబాద్ అభివృద్ధి ఏదీ అని ప్రశ్నిస్తోంది. అవినీతి పాలన అని విమర్శలు చేస్తోంది. అదే టైంలో కుటుంబ పాలన అని గట్టిగానే అందుకుంటోంది. దీంతో ఎక్కడ కొట్టాలో అక్కడే దెబ్బ‌ కొడుతోంది బీజేపీ.  బహుశా ఇవన్నీ అన్ని  పార్టీలకు వచ్చే సమస్యలే కానీ  టీయారెస్ కి కవచకుండలాలుగా తెలంగాణా సెంటిమెంట్ ఎపుడూ కాపాడుతూ వస్తోంది. ఇపుడు మాత్రం అది పనికి రాదు అని తేలిపోయింది. అలా తేల్చేసిన ఘనత బీజేపీదే. దాంతో కచ్చితంగా వీటి మీద ఇపుడు టీయారెస్  మాట్లాడాలి. ఇక అభివృద్ధి చేశామని అధికారంలో ఉన్న పార్టీ ఎంత చెప్పినా జనాల్లో అసంతృప్తి ఎపుడూ ఉంటూనే ఉంటుంది. అదే ఇపుడు బీజేపీకి వరం అవుతుందా అన్నదే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: