జైపూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకపక్క సోనియా తప్పుకోవడం, మరో పక్క రాహుల్‌కు ఆ పదవిపై ఆసక్తి లేకపోవడంతో తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త పేరు తెరమీదకొచ్చింది. అదేంటంటే ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గెహ్లోత్‌ను తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయనున్నారట. అయితే రాహుల్ ఈ పదవిని వద్దంటేనే గెహ్లోత్‌కు ఈ పదవి దక్కనుంది.

ఇప్పటికే మంత్రి మండలి విస్తరణలో అశోక్ గెహ్లోత్ తలమునకలవుతున్నాడు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ అధిష్ఠానం అతడిని ఢిల్లీకి పిలిపించి, పార్టీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయంలో రాహుల్ గాంధీ నుంచి స్పష్టమైన హామీ ఏమీ అందలేదు. దీంతో గాంధీ కుటుంబానికి దగ్గరి వ్యక్తి అయిన అశోక్ గెహ్లోత్‌కు ఈ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోందట.

పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించే విషయమై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ రేపు(శుక్రవారం) జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేసిన తరువాత అతని మద్దతుదారులు కూడా తమ సైలెంట్ అయిపోయారు. మళ్లీ పదవి చేపట్టడంపై రాహుల్ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకపోతే ఆ పదవిలో సీనియర్ నాయకుడిని ఎవరినైనా ఎన్నుకోవాలని పార్టీ కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అశోక్ గెహ్లోత్ పేరు తెరమీదకొచ్చింది. సీనియర్ నేతలతో పాటు యువ నేతలతో కూడా గెహ్లోత్‌కు మంచి సంబంధాలున్నాయని, ఆయనయితే ఇరు తరాలకూ పటిష్ఠమైన వారథిగా వ్యవహరిస్తారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే గతంలో ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు గెహ్లాత్ నిరాకరించారు. తాను సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. కాగా ఇప్పటి పరిస్థితుల్లో రాజస్థాన్‌ను విడిచిపెట్టి ఢిల్లీ వెళ్లేందుకు గెహ్లోత్ అంగీకరాస్తారో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: