ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ హైకోర్ట్ నేడు తీర్పు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ జరగాల్సిందే అని స్పష్టం చేసింది. పంచాయితీ ఎన్నికల పై 36 పేజీల తీర్పు ఇచ్చిన రాష్ట్ర హై కోర్టు ధర్మాసనం... తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం అని పేర్కొంటూ... ఈ రోజు ఉన్న న్యాయం, చట్టం ప్రకారం జనవరి 8వ తేదిన సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు చెల్లదు అని స్పష్టత ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమీషన్ విధి  అని పేర్కొంది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించాల్సిందిగా కోర్టు ఆదేశించింది అని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కె) ప్రకారం ఎన్నికల కమీషన్ సమర్దవంతంగా పనిచేసేందుకు తప్పనిసరిగా ప్రభుత్వం సహకరించాల్సిందేఅని క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించాలి అని, అప్పుడే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి అని అభిప్రాయపడింది. కిషన్ సింగ్ తోమర్  కేసులో ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది అని పేర్కొంది.

ఎన్నికలు నిర్వహించాలా...లేదా...అందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా,...లేదా అనేది ఎన్నికల కమీషనే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అని వెల్లడించింది. ప్రకృతి వైపరిత్యాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిన సమయంలో ఎన్నికలను వాయిదా వేసే అధికారం కమీషన్ కు ఉంటుంది అని, ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమీషన్ సంప్రదించాల్సి ఉంటుంది. అత్యంత అరుదైన సందర్బాలలో మాత్రమే ఇటువంటి చర్యలు తీసుకోవాలి అని సూచించింది. ఇటువంటి సాంప్రదాయాలు అదే పనిగా జరిగే వీలు లేదు అని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల పదవీ కాలం పూర్తయిన వెంటనే ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉంది అని తెలిపింది. కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు భారత ఎన్నికల సంఘంకు ఉన్న అధికారాలు ఉన్నాయి అని, ఆయా రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణ అంతా రాష్ట్ర ఎన్నికల కమీషన్ పైనే ఆధారపడి ఉంటుంది అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: