చిత్తూరు లో టెన్షన్ వాతావరణం నెలకొంది.. టీడీపీ నేతలు భయంలో ఉన్నారు. ఇంటి నుంచి బయటకు రావాలన్నా కూడా భయపడుతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.జిల్లావ్యాప్తంగా ఉన్న తెదేపా నాయకులు నిరసనల్లో పాల్గొనడానికి ఆయా నగరాలకు వస్తుండగా పోలీసులు గృహ నిర్బంధాలు, అరెస్టులతో అడ్డుకున్నారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి పలమనేరులో బైఠాయించారు. కుప్పంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్‌, శాంతిపురంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులును గృహ నిర్బంధంలో ఉంచారు.


కుప్పం పట్టణంలో కొంతసేపు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నాయకులు ధర్నా చేశారు. పుంగనూరు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనీషారెడ్డి, సమన్వయకర్త శ్రీనాథరెడ్డిని పెద్దపంజాణి మండలం కెళవాతిలో ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్భందం చేశారు.చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీ బి.ఎన్‌.రాజసింహులు, మాజీ మేయర్‌ కఠారి హేమలత, మాజీ టౌన్‌ బ్యాంకు ఛైర్మన్‌ షణ్ముగం, రాష్ట్ర కార్యదర్శి సందీప్‌, నాయకులు సురేంద్రకుమార్‌, వైవీరాజేశ్వరితో పాటు పలువురు నాయకులను నిర్బంధించారు. నిరసన కార్యక్రమాలకు హాజరు కావడానికి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.


ఈ మేరకు నేతలు అందరూ కార్యాలయంలో ఉండిపోయారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలకు ముందు చూస్తే నుయ్యి.. వెనక చూస్తే గొయ్యి లా మారింది. ఈరోజు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఇప్పటికీ టీడీపీ లో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన నేతలు నిన్నటి వరకు మొహం చాటేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎంటో అనే చర్చగా మారింది. నిన్నటి నుంచి నగరం లో టీడీపీ నేతల పై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. వెలుగు చూస్తున్న పరిస్థితులను చూస్తే చిత్తూరు లో టీడీపీ కి షాక్ తగిలేలా ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: