పంచాయతీ ఎన్నికలకోసం మేనిఫెస్టో విడుదల చేసి చేతులు కాల్చుకున్న టీడీపీ.. ఈసారి పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలకోసం రంగంలోకి దిగింది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు నారా లోకేష్, ఇంకోవైపు బాలకృష్ణ.. ఇలా అందరూ రంగంలోగి దిగారు. అయితే విశాఖలో నారా లోకేష్ పర్యటనపైనే అందరి దృష్టీ నిలిచింది. గతంలోకంటే భిన్నంగా ఈసారి మరింత దూకుడుగా పర్యటనలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు నారా లోకేష్.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక పింఛన్లు పెంచుకుంటూ పోతాం అని చెప్పారు కానీ.. ఉల్లి, నూనె, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతారని అనుకోలేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రెండేళ్లుగా వైసీపీ విశాఖకు చేసిందేమీ లేదని, మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీని నమ్మి అధికారం ఇస్తే విశాఖ నగరాన్ని దోచేస్తారని విమర్శించారు. ఒకసారి గెలిపించినందుకే స్టీలు ప్లాంటుని అమ్మకానికి పెట్టిన జగన్, మరోసారి గెలిపిస్తే విశాఖనూ అమ్మేస్తారని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక, పెదగంట్యాడ, స్టీలుప్లాంటు, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో పర్యటించిన లోకేష్, ప్రభుత్వ పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

వైసీపీ హయాంలో ఓ చేత్తో రూ.100 ఇచ్చి మరో చేత్తో రూ.వెయ్యి లాగేసుకుంటున్నారని విమర్శించారు. టీడీపీకి అధికారమిస్తే, స్టీల్‌ ప్లాంటును ప్రైవేటుపరం కానివ్వబోమని అన్నారు లోకేష్. కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. పేదల నీటి పన్ను మాఫీ చేస్తామని, అన్న క్యాంటీన్లు తెరిపిస్తామని చెప్పారు.

లోకేష్ రాకతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వస్తుందని ఊహించలేం కానీ.. పర్యటనకు మాత్రం భారీగా జన సమీకరణ చేసి టీడీపీ తన ఉనికి చాటుకున్నట్టు అయింది. అందులోనూ లోకేష్ కూడా టీడీపీ కార్యకర్తల్ని ఉత్సాహపరిచేలా ప్రసంగించారని అంటున్నారు నాయకులు. అటు టీఎన్ఎస్ఎఫ్ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశం కూడా సందడిగా సాగింది. యువత అంతా లోకేష్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ హడావిడిని ఓట్ల రూపంలో లెక్కకట్టలేం కానీ.. మొత్తమ్మీద లోకేష్ రాకతో విశాఖలో పార్టీ శ్రేణుల్లో కదలిక వచ్చిందనే మాట మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: