క‌మ్యూనిస్టు పార్టీల‌కు ప‌ట్టుకొమ్మ అయిన విజ‌య‌వాడ‌లో సీపీఎం పార్టీ ఒంట‌రిగా పోటీ చేస్తోంది. త‌మ‌కు అనుకూలంగా ఉన్న ఉద్య‌మ ప్రాతిప‌దిక‌న వార్డుల‌ను ఎంపిక చేసుకుని.. అత్యంత కీల‌క‌మైన నాయ‌కుల‌ను ఇక్క‌డ బ‌రిలో నిలిపింది. వీటిలోనూ ప్ర‌ధానంగా శివారు ప్రాంతంలోని ప్ర‌కాశ్‌న‌గ‌ర్‌లో 62వ డివిజ‌న్‌ను అత్యంత కీల‌కంగా భావిస్తున్నారు. గ‌తంలో చిగురుపాటి బాబూ రావు ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హించి ఉండ‌డం.. పైగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను జోరుగా చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ఎవరిని క‌దిపినా.. సీపీఎం కే త‌మ ఓటు అనే మాట వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
62వ డివిజ‌న్ నుంచి షేక్ ఇందిర పోటీ చేస్తున్నారు. ఉద్య‌మాల్లో ఆమె నిరంత‌రం చేసిన పార్టిసిపేష‌న్‌.. ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా అండ‌గా ఉన్న వైనం.. ఇప్పుడు ఆమెకు ప్ల‌స్‌గా మారుతున్నాయ‌ని స్థానికులు చెబుతున్నారు. వాస్త‌వానికి టీడీపీ త‌ర‌ఫున కానీ, వైసీపీ త‌ర‌ఫున కానీ.. పోటీ చేస్తున్న వారు ఏనాడూ.. ఇందిర మాదిరిగా సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న ప‌రిస్థితి లేదు. ఎన్నిక‌ల‌కు ముందు అంటే.. గ‌త ఏడాది మాత్ర‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. పైగా క‌రోనా స‌మ‌యంలోనూ వారు.. ఎవ‌రికి వారు సైలెంట్ అయిపోయారు.
కానీ, ఇందిర మాత్రం క‌రోనాను సైతం లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌ల‌కు అన్నివిధాలా నేనున్నానంటూ.. అండ‌గా నిలిచారు. దీంతో 62వ డివిజ‌న్‌లో క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించేలా చేశారు. ఇంటింటికీ మాస్కులు పంపిణీ చేశారు. పేద‌ల‌కు నిత్య‌వ‌స‌రాల‌ను పంచిపెట్టారు. పార్టీ త‌ర‌ఫున కూడా అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. స్థానికంగా నివాసం ఉంటూనేస్థానిక స‌మ‌స్య‌ల‌పై అలుపెరుగ‌ని పోరాటం చేశారు. దీంతో ఇప్పుడు విజ‌య‌వాడ మొత్తంలో సీపీఎం త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన వారు.. ఎవ‌రు గెలుస్తార‌నే విష‌యంలో సందేహాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఒక్క 62వ డివిజ‌న్ నుంచి పోటీ చేస్తున్నషేక్‌ ఇందిర విష‌యంలో మాత్రం సీనియ‌ర్ కామ్రెడ్స్ నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు.. స్థానికంగా ప్ర‌జ‌ల నుంచి పొరుగున ఉన్న‌వారు విశ్లేష‌కులు కూడా ఒక అంచ‌నాకు వ‌చ్చారు.
ఇందిర‌మ్మ ఖ‌చ్చితంగా గెలుస్తుంద‌ని.. ఎడ్జ్ ఆమెకే ఉంద‌ని ఇక్క‌డ భారీ ఎత్తున జ‌నం టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే సీపీఎం కూడా త‌మ‌కు ఖ‌చ్చితంగా 62వ డివిజ‌న్ ద‌క్కుతుంద‌ని.. త‌మ అభ్య‌ర్థి షేక్ ఇందిర గెలిచి తీరుతుందన్న ఆశ‌ల‌తో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: