డీఆర్‌డీవో లేబొరేటరీ ఇన్మాస్‌, రెడ్డి ల్యాబ్స్‌ కలసి అభివృద్ధి చేసిన 2-డీజీ కరోనా ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగులకు 2డీజీ ఔషధం ఒక సంజీవనిలా పని చేస్తుందని తయారీదారులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వేగవంతంగా మెరుగుపరచడానికి.. ఆక్సిజన్ వినియోగం తగ్గించడానికి 2-డీజీ డ్రగ్ కీలక పాత్ర పోషించనుంది. అయితే 2-డీజీ డ్రగ్ యొక్క 10,000 డోసులు ఈరోజు సాయంత్రం లేదా రేపు అనగా మే 15వ తేదీన విడుదల అవుతాయని సమాచారం అందుతోంది. ఈ సమర్థవంతమైన 2డీజీ ఔషధం ఉత్పత్తి త్వరలోనే హైదరాబాద్ తో పాటు ఇతర డ్రగ్ సెంటర్లలో కూడా ప్రారంభమైతే ఎందరో ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.

ఈ డ్రగ్ శాస్త్రీయ సూత్రం సింపుల్ పదాలలో చెప్పాలంటే  "మోసగాళ్లను మోసం తోనే ఓడించడం" అని చెప్పుకోవచ్చు. వివరంగా చెప్పుకుంటే.. ఏదైనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ వైరస్ శరీర కణాలపై దండయాత్ర చేస్తూ దాని కాపీలను తయారు చేస్తుంది. కరోనా వైరస్ లో ఉండే ఓ ఎంజైమ్ మానవ కణాలను చీట్ చేస్తూ కణాలలోని ప్రోటీన్ ఉపయోగించి దాని లాంటి వైరస్ నే పుట్టిస్తుంది. ఈ ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. వైరస్ తన కాపీ మెషిన్ ని ఉపయోగించి కోట్ల సంఖ్యలో వైరస్ లను పుట్టిస్తుంది.

అయితే ఒక వైరస్ మరొక వైరస్ ను సృష్టించడానికి ఎనర్జీ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం వైరస్ శరీర కణాలలోని గ్లూకోస్ ను ఉపయోగిస్తుంది. 2డీజీ డ్రగ్ అనేది సూడో గ్లూకోజ్‌ కాగా.. ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత శరీరంలో కరోనా సోకిన కణాలలోకి సూడో గ్లూకోజ్‌ చేరుతుంది. కరోనా వైరస్ ఉన్న శరీర భాగమంతా కూడా సూడో గ్లూకోజ్‌ ఉండిపోవడం వల్ల కొత్త వైరస్ పుట్టకకు అడ్డంకి ఏర్పడుతుంది. ఎలాగంటే.. వైరస్ లు వాటినుంచి వేరొక కొత్త వైరస్ లు సృష్టించడానికి కణాల నుంచి గ్లూకోజ్‌ కి బదులు సూడో గ్లూకోజ్‌ తీసుకుంటాయి. ఈ సూడో గ్లూకోజ్‌ ఇంకొక వైరస్ తయారు చేసేందుకు ఎటువంటి ఎనర్జీ ఇవ్వదు. ఫలితంగా కోట్లలో పుట్టుకొచ్చే వైరస్ ల సంఖ్య శరవేగంగా పడిపోతుంది. ఈ క్రమంలోనే మన శరీరంలోని యాంటీబాడీస్ సమర్థవంతంగా ఇతర వైరస్ లను కూడా చంపేస్తాయి. ఈ విధంగా 2డీజీ డ్రగ్ రోగుల ప్రాణాలు కాపాడుతుంది. అద్భుతమైన ఆలోచనతో మన ఇండియన్ శాస్త్రవేత్తలు ఇలాంటి డ్రగ్ తయారు చేయడం నిజంగా గర్వకారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: