కొన్నాళ్ళ నుంచి దారుణాలు చిన్నారులపై పెరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇటీవల సైదాబాద్ లో జరిగిన ఒక ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. తాజాగా సైదాబాద్ పరిధి పూసల బస్తీలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ కాస్త పసికందు ప్రాణం తీసింది. చిన్నారి మరణానికి తల్లి తండ్రులు కారణం అయ్యారు. పోలీసుల అదుపులో పసికందు తల్లిదండ్రులు రాజేష్‌ అలియాస్‌ రాజు (36), జాహ్నవి (25) దంపతులు ఉన్నారు. పసికందు తండ్రి రాజేష్‌ సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాడు.

భార్యా భర్తల గొడవల ఆవేశంలో భర్త రాజేష్ ప్లాస్టిక్‌ పైపుతో భార్య మీద దాడి చేశాడు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు ఆమె( 22) రోజుల శిశువును అడ్డుగా పెట్టింది. ఈ గొడవలో చిన్నారి కంటిపై గట్టిగా దెబ్బ తగిలగా... భార్య తనను తాను రక్షించుకునే క్రమంలో శిశువు గొంతును గట్టిగా పట్టుకోవడం ఆ తర్వాత ఊపిరాడకపోవడంతో పసికందు అపస్మారకస్థితికి చేరడం క్షణాల్లో జరిగిపోయింది. స్థానికులు గమనించి హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు.

మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నీలోఫర్‌ ఆసుపత్రికి పోలీసులు చిన్నారిని తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజేశ్‌, జాహ్నవి దంపతులకు ఈ శిశువు రెండో సంతానం అని పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం వారి తొలి సంతానం.. (ఐదు నెలల బాబు)ను మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి విసిరేయాగా సంరక్షణ కోసం యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌ లో ఆ చిన్నారిని ఉంచారు. రెండో కుమారుడు వీరి ఘర్షణకు బలైన తీరు ఇప్పుడు అక్కడ విషాదం నింపింది. పసికందు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పసికందు మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు... స్థానికులను కూడా విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: