బాహుబ‌లి సినిమా త‌రువాత చాలా డ‌బ్బులు వినోద‌పు ప‌న్ను రూపంలో చెల్లించాల్సిన డ‌బ్బులు ఎగవేశార‌ని, అందుకే తాము కొత్త విధానం ఒక‌టి అమ‌లులోకి తెచ్చి, ఆన్లైన్ లోనే ప్ర‌భుత్వ‌మే టిక్కెట్ల విక్ర‌యాన్ని చేప‌డుతుంద‌ని ఏపీ స‌ర్కారు చెబుతోంది. ఈ త‌రుణంలో అఖండ లాంటి పెద్ద సినిమాలు వ‌చ్చినా కూడా అవి నిల‌దొక్కుకోవ‌డం క‌ష్టం. సినిమా నిర్మాణ‌మే చాలా ఎక్కువ అని  తేలిపోయాక, మారిన లేదా త‌గ్గించిన టికెట్ ధ‌ర‌ల కార‌ణంగా ఆ పాటి డ‌బ్బులు ఎలా వెన‌క్కు వ‌స్తాయి? ఒక‌వేళ ఆన్లైన్లో ప్ర‌భుత్వ‌మే టిక్కెట్లు అమ్మ‌కాలు సాగించిందే అనుకుందాం వ‌సూలు అయిన డ‌బ్బులు వెంట వెంట‌నే బ‌య్య‌ర్ల‌కు చెల్లిస్తుంద‌ని ఏంటి గ్యారంటీ అని అంటున్నారు ఇంకొంద‌రు. అయితే థియేట‌ర్ లో తెగే ప్ర‌తి టికెట్ కు ఇంత‌వ‌ర‌కూ స‌రైన రీతిలో వినోద‌పు ప‌న్ను చెల్లించ‌లేద‌ని, అందుకే అంద‌రినీ సంప్ర‌దించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. ఈ ద‌శ‌లో సినిమా బాగుండాలి అని అనుకోవ‌డంలో త‌ప్పేం లేదు కానీ బాగుండేందుకు హీరోలు ఏం చేస్తారు..నిర్మాత‌లు ఏం చేయ‌నున్నారు.. లేదా ద‌ర్శ‌కులు ఏం చేయాల‌ని భావిస్తున్నారు అన్న‌వి ఇప్పుడిక ముఖ్యం.


ఇప్ప‌టిదాకా ఒక లెక్క ఇక‌పై ఒక లెక్క అన్న విధంగా ఇండస్ట్రీ ఉండ‌నుంది. హీరోల ఇమేజ్‌లూ ఇగోలూ రెండూ మార‌నున్నాయి. అన్నింటినీ అంద‌రూ స‌ర్దుకోవాల్సిందే! అన్నింటినీ అంటే లాభ‌న‌ష్టాల‌ను అని అర్థం. ముఖ్యంగా ఒక‌ప్ప‌టిలా ఏవీ లేవు. మార్కెట్ అస్స‌లు అనుగుణంగా లేదు. కోవిడ్ త‌రువాత వ‌రుస ఇబ్బందులు వ‌చ్చి చుట్టుముడుతున్నాయి. పెద్ద సినిమాల‌కు ఉన్నంత క‌ష్టం చిన్న సినిమాల‌కు లేదు అని అనుకోవడానికి లేదు. కానీ ప‌రిమిత బ‌డ్జెట్ కార‌ణంగా కాన్సెప్ట్ బాగుంటే నాలుగు డ‌బ్బులు వెన‌క్కు వ‌స్తాయ‌న్న గ్యారెంటీ ఆ రోజూ ఉంది ఈ రోజూ ఉంది. ఇది మిన‌హా మిగతావి ఆలోచిస్తే హీరోల ఇగోలు పూర్తిగా ప‌క్క‌న ఉంచి, ప్ర‌తి సినిమా త‌మ సినిమానే అని భావించి ప‌నిచేయాల్సిన, ప్ర‌చారం చేయాల్సిన రోజు రానే వ‌చ్చింది. అదేవిధంగా ఇదివ‌ర‌క‌టిలా మోతాదుకు మించి డ‌బ్బులు ఖ‌ర్చు పెడ‌తాం అంటే జ‌ర‌గ‌ని ప‌ని. పెద్ద సినిమాల‌న్నింటిపైనా ఏపీ స‌ర్కారు తీసుకున్న ఒక్క నిర్ణ‌యం తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది.
టికెట్ రేట్లు త‌గ్గించి తాము సామాన్యుడికి చౌక‌గా వినోదం అందిస్తున్నామ‌ని ఏపీ స‌ర్కారు గొప్ప‌లు చెప్పుకుంటున్నా, ఆ నిర్ణ‌యం కార‌ణంగా ఎన్ని కుటుంబాలు న‌ష్ట‌పోతాయో ఆలోచించడం లేదు. పెద్ద సినిమాలు అంటే భారీ తారాగ‌ణం త‌ప్ప‌నిస‌రి! అందుకు త‌గ్గ ఖ‌ర్చు త‌ప్ప‌నిస‌రి! ఎంత హీరోలు రెమ్యున‌రేష‌న్ విష‌య‌మై త‌గ్గి వ‌చ్చినా మిగిలిన ఖ‌ర్చులు ఉండేవే! ఇప్పుడున్న ప‌రిధిలో వంద రూపాయ‌లకే టికెట్ అమ్మడం వ‌ల‌న భారీ బ‌డ్జెట్ సినిమాలు పూర్తిగా న‌ష్ట‌పోతాయి..అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు  చెబుతున్నాయి. ఈ త‌రుణంలో సినిమాల నిర్మాణం ఒక‌ప్ప‌టిలా లాభ‌దాయ‌క వ్యాపారం కాదు అని తేలిపోయింది. ఎంత ఓటీటీలు వ‌చ్చినా థియేట‌ర్లు బ‌తికితేనే సినిమా బ‌తికేది. లో బ‌డ్జెట్ సినిమాల‌కు ఓ విధంగా ఇలాంటి ప‌రిణామాలు బాగానే క‌లిసి వ‌స్తాయి కానీ, అన్ని సినిమాల‌కూ వంద రూపాయ‌ల‌కే టికెట్ అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని!


మరింత సమాచారం తెలుసుకోండి: