తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారుల త‌లా తోకా లేని నిర్ణ‌యాల‌తో భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. తిరుప‌తిలోని శ్రీ‌నివాసం వ‌ద్ద జారీచేస్తున్న స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీని అక‌స్మాత్తుగా నిలిపేసింది. ప్ర‌తిరోజు రెండువేల మంది భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీచేస్తున్న సంగ‌తి తెలిసిందే. అవి కూడా చిత్తూరు జిల్లావాసుల‌కే కేటాయించారు. క‌రోనా నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. రూ.300 టికెట్లు కావాల్సిన‌వారు నెల‌కోసారి విడుద‌ల‌చేసే కోటాలో బుక్ చేసుకోవ‌డ‌మే. తిరుమ‌ల గిరుల‌పై కొలువైన స్వామిని ద‌ర్శించుకోవాలంటే అంత‌కుమించి వేరే మార్గం లేదు. రేప‌టి నుంచి ఆన్‌లైన్‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీచేస్తామ‌ని చెప్ప‌డంతో భ‌క్తులు అక్క‌డే ఆందోళ‌న‌కు దిగారు. ఆన్ లైన్‌లో ఎన్ని అక్ర‌మాలు జ‌రుగుతాయో, టికెట్లు విడుద‌లైన వెంట‌నే ఎలా అయిపోతున్నాయో కొన్ని నెల‌లుగా భ‌క్తులు చూస్తూనే ఉన్నారు. అక‌స్మాత్తుగా ఆన్ లైన్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో భ‌క్తులు మండిప‌డుతున్నారు. వారిని అక్క‌డి నుంచి పంపించివేయ‌డానికి అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. శ్రీ‌నివాసం వ‌ద్ద పోలీసులు భారీసంఖ్య‌లో మొహ‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: