ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలంటే జనం భయపడే పరిస్థితి ఉంది. ఏ చిన్న సేవ కోసం వెళ్లినా లంచాలు అడుగుతారన్నపేరు ఉంది. పైసా లేనిదే పనులు కానేకావన్న అపవాదు ఉంది. డబ్బు చేతిలో పడందే ఫైల్ కదలదన్న బ్రాండ్ ఇమేజ్‌ ఉంది. అందులోనూ రెవెన్యూ కార్యాలయం అనగానే ఈ భయం మరింత పెరుగుతుంది. వీఆర్వో దగ్గర నుంచి.. ఆర్‌ ఐ, తహశీల్దార్‌, ఆర్డీవో.. ఇలా రేంజ్‌ పెరిగే కొద్దీ లంచాల రేంజ్ కూడా పెరుగుతుంటుంది.


కానీ ఓ అధికారి మాత్రం.. ప్రజల భయాన్ని పోగొడుతున్నాడు. ఏకంగా నాకు లంచం వద్దు అంటూ మెడలో కార్డు వేసుకుని మరీ పని చేస్తున్నాడు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం అదనపు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చిలకరాజు నర్సయ్య ను చూస్తే శభాష్ అనిపించాలనిపిస్తుంది. రెవెన్యూ కార్యాలయానికి వచ్చేటప్పుడు తన జేబుకు 'నాకు లంచం వద్దు' అని ఐడీ కార్డును పెట్టుకుంటారు. ఐడీ కార్డుపై నాకు లంచం వద్దు అని పెద్ద అక్షరాలతో రాయించుకున్నారు.


ఎందుకు ఇలా జేబుకు ఐడీ కార్డు పెట్టుకున్నారు అని అడిగితే... ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి కదా.. నేను లంచం తీసుకోకపోయినా.. నన్నూ అలాగే అనుకుంటారు. అందుకే నాకు లంచం వద్దు అని ప్రత్యేకంగా రాయించుకున్నాను అంటున్నారు. ఇలా రాయించుకోవడం వల్ల .. ప్రజల్లో లంచాల పట్ల భయం పోతుందని.. అధికారులు అంతా లంచగొండులు కాదన్న విషయం తెలుస్తుందని రాజు అంటున్నారు.


అలాగే లంచాలు తీసుకునే అధికారులు, సిబ్బంది ఈ కార్డు చూసి కాస్త సిగ్గుపడతారని నర్సయ్య ఆశిస్తున్నాడు. అందులోనూ నర్సయ్య . అటెండర్ గా ఉద్యోగం ప్రారంభించి ఏ ఆర్‌ఐగా ఎదిగారు.  జనం పడే ఆర్థిక ఇబ్బందులు ఆయనకు బాగా తెలుసు. జీతాలు తీసుకుంటూ కూడా  మళ్లీ లంచాలు తీసుకోవడం అన్నది నర్సయ్య మనస్తత్వానికి విరుద్దం.. మరి అందరు ఉద్యోగులు నర్సయ్యలా ఆలోచిస్తే ఎంత బావుంటుందో కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: