సాధార‌ణ ప్ర‌జ‌లు స‌హా రాజ‌కీయాల్లో ఉన్న వారికి కూడా సెంటిమెంట్లు చాలానే ఉంటాయి. కొంద‌రికి పేర్లు సెంటిమెంటు అయితే.. మ‌రికొంద‌రికి నెంబ‌ర్లు సెంటిమెంట్లు, ఇంకొంద‌రికి వారాలు సెంటిమెంట్లు. మొత్తానికి సెంటిమెంట్లు చాలానే ఉంటాయి. మేం.. నాస్తికులం మాకు ఎలాంటి ప‌ట్టింపులు లేవు.. అని చెప్పుకొన్న నాయకులు కూడా సెంటిమెంటును ప‌ట్టుకుని వేలాడిన వారు ఉన్నారు. అయితే, త‌న వ్య‌క్తిగ‌తానికి కాకుండా.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీకి సంబంధించిన సెంటిమెంటును మ‌న‌సులో పెట్టుకుని ర‌గిలిపోయిన నాయ‌కుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్న‌న్నాళ్లూ.. 202 అనే నెంబ‌రును త‌న ద‌రికి కూడా చేర‌నిచ్చేవారు కాదు. అప్ప‌ట్లో త‌ను ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు కూడా అసెంబ్లీ హాల్‌లో త‌న‌కు 202 నెంబ‌రు గ‌దిని కేటాయించిన‌ప్పుడు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

అది మారిస్తేనే త‌ప్ప‌.. తాను అందులో నుంచి కార్య‌క‌లాపాలు చేయ‌న‌ని భీష్మించి.. ఎట్ట‌కేల‌కు ఆరు మాసాలు పోరాడి.. ఈ గ‌దిని మార్పించుకున్నారు వైఎస్‌. మ‌రి ఎందుకు ఆయ‌న‌కు 202 కు మ‌ధ్య ఇంత‌టి విభేదం?  ఆయ‌న ఎందుకు 202 అంటే అంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేవారు? ఆయ‌న‌కేమ‌న్నా.. 202 అంటే భ‌య‌మా? అనే చ‌ర్చ చాన్నాళ్లు సాగింది. దీనిపై అనేక విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. కానీ, ఎవ‌రూ కూడా వైఎస్ మ‌న‌సులోని మాట‌ల‌ను గ్ర‌హించ‌లేక పోయారు. 202 వెనుక చాలా స్టోరీ ఉంద‌ని వైఎస్ చాలా మార్లు లీకులు ఇచ్చారే త‌ప్ప‌.. ఎవ‌రికీ దీని వెనుక ఉన్న ర‌హ‌స్యం మాత్రం చెప్ప‌లేదు. త‌ర్వాత కాలంలో పీవీ జీవిత చ‌రిత్ర‌ను అక్ష‌ర బ‌ద్ధం చేసిన ఐఏఎస్‌ పీవీఆర్ కే ప్ర‌సాద్ ఒక చోట ఈ విష‌యాన్ని ప్ర‌స్థావించారు.

 

1983లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించిన‌ప్పుడు.. అప్ప‌టికే మంచి జూమ్‌లో ఉన్న కాంగ్రెస్ నేల‌మ‌ట్ట‌మైంది. దాదాపు 175 మందితో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను టీడీపీ అధినేత ఎన్టీఆర్ 60కి ప‌రిమితం చేశారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 202 స్థానాల్లో అన్నగారు ఏక‌ఛ‌త్రాధిప‌త్యంతో అభ్య‌ర్థుల‌ను గెలిపించుకున్నారు. ఈ విష‌యంపై కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం చెందింది. కాంగ్రెస్‌కే గుండుగుత్తుగా ఓట్లు వేసే జిల్లాలు సైతం టీడీపీ తుడిచి పెట్టేసింది. ఈ క్ర‌మంలో ఇందిర‌మ్మ ద‌గ్గ‌ర జ‌రిగిన ఓ స‌మావేశంలో ఈ నెంబ‌ర్ ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. ``వై డోంట్ ఉయ్ సెక్యూర్ దోజ్ సీట్స్ ఇన్ ఫ్యూచ‌ర్‌.?  హూవిల్ టేక్ దిస్‌.. ఛాలెంజ్‌`` అని ప్ర‌శ్నించార‌ట‌.

 

అయితే, ఇందిర‌మ్మ ఛాలెంజ్‌ను స్వీక‌రించేందుకు ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్లు ఎవ‌రూ ముందుకు రాలేదు. వైఎస్ కూడా !! కానీ, ఆమె మ‌ర‌ణాంత‌రం.. వైఎస్ ఆమె కోరిక‌ను సాధించాల‌ని అనేక క‌ల‌లు క‌న్నార‌ని, రాష్ట్రంలో 202 సీట్లు సాధించి కాంగ్రెస్‌ను గెలిపించుకునేందుకు కృషి చేశార‌ని ఈ క్ర‌మంలోనే 2004లో 185 స్థానాలు సాధించార‌ని, కానీ, వైఎస్ ఈ కోరిక తీర‌కుండానే వెళ్లిపోయార‌ని అందుకే ఆయ‌న‌కు 202 అంటే ఒకింత ఆగ్ర‌హం(టీడీపీ సాధించింద‌ని,) కొంత ప్రేమ‌(తాము సాధించాల‌ని) ఉంద‌ని పీవీఆర్ కేప్ర‌సాద్ రాసిన పుస్త‌కంలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: