తమిళనాడులో బీజేపీ పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా ఏమీ ఇలా అయిపోలేదు. దశాబ్దాలుగా కమలంపార్టీ పరిస్దితి ఇదే. కాకపోతే ఇపుడు కేంద్రంలో ఏడేళ్ళుగా  అధికారంలో ఉంది కాబట్టి అరవదేశంలో ఏమైనా బలం పుంజుకుందేమో అని అనుకున్నారు. కానీ ఎన్నికల ప్రక్రియ  మొదలైన తర్వాత చూస్తే పార్టీ పరిస్దితంతా ఉత్త డొల్లే అని అర్ధమైపోతోంది. అధికార అన్నా డీఎంకేతో పొత్తుల ద్వారా రాబోయే ఎన్నికలను ఎదుర్కునేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఏంకే అగ్రనేతలు పళనిస్వామి, పన్నీర్ శెల్వం మాత్రం బీజేపీకి 20 సీట్లకు మించి ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. అయితే బీజేపీ ఏమో 30 సీట్లడుగుతోంది. సరే సీట్ల సర్దుబాటు సమయంలో ఇలాంటివన్నీ చాలా సహజమే.




అయితే బీజేపీ అసలు బేలతనం ఇక్కడే బయటపడింది. అదేమిటంటే మొన్ననే జైలు నుండి విడుదలైన శశికళను తమతో చేతులు కలపాలని బీజేపీ నేతలు ఒత్తిళ్ళు తెస్తున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఒకవైపేమో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని తానే అని శశికళ చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో చిన్నమ్మకు ఏఐఏడీఎంకేకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి పళనిస్వామి పదే పదే చెబుతున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో శశికళను కూడా కలుపుకోవాలని బీజేపీ నేతలు పళనిస్వామిపై ఒత్తిడి పెడుతున్నారు. పళని-శశికళ మధ్య సమస్య ఇప్పట్లో తెగేదికాదు. మరి అసలు సమస్య తేలకుండానే వీళ్ళ కూటమిలో శశికళ ఏ హోదాలో, ఏ పార్టీ తరపున జాయిన్ అవుతారు ?




ఇపుడిదే అంశం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అక్రమాస్తుల సంపాదనలో నాలుగేళ్ళ జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన శశికళ లేకుండా ఎన్నికల్లో పాల్గొనటం కష్టమని బీజేపీ నేతలు భవిస్తుండటమే ఆపార్టీ దీనస్ధితికి అద్దం పడుతోంది. సర్వే నివేదికల ప్రకారమైతే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది డీఎంకేనే అని అర్ధమవుతోంది. ఇలాంటి పరిస్దితుల్లో అన్నాడీఎంకే+బీజేపీతో శశికళ చేరినా చేరకపోయినా రిజల్టయితే ఒకటే.  మరి ఇంకెందుకు బీజేపీ శశికళ కోసం అంతగా పట్టుబడుతోంది ? ఎందుకంటే శశికళ నాయకత్వం మీద కమలనాదులు పెద్ద ఆశలే పెట్టుకున్నట్లున్నారు. అందుకనే అక్రమసంపాదన ఆరోపణలు రుజువై జైలుకు వెళ్ళివచ్చినా బీజేపీ నేతలు చిన్నమ్మతో చేతులు కలపటానికి తెగ ఆరాటపడిపోతున్నారు. దీంతోనే బీజేపీ పరిస్ధితి ఎంతగా దిగజారిపోయిందో అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: