రాజకీయాల్లో తమ వాక్చాతుర్యంతో ప్రత్యర్ధులకు చెక్ పెట్టే నాయకుల్లో అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రత్యర్ధి పార్టీ టీడీపీకి కౌంటర్లు ఇచ్చే అంబటి...తన రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన వైఎస్ ఫ్యామిలీ వెంటే నడిచారు. మంచి మాటకారి..సున్నితంగానే ప్రతిపక్షాలకు చురకలు అంటిస్తారు. అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో కౌంటర్లు వేస్తారు. ఇక రాంబాబు పోలిటికల్ కెరీర్ చూసుకుంటే...ఆయన 1989లో రేపల్లె నుంచి తొలిసారి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1994, 99లో అదే కాంగ్రెస్ నుంచి ఓడిపోయారు.


ఇక తర్వాత కాంగ్రెస్ టికెట్ రాకపోయినా, వైఎస్ అనుచరుడుగా ముందుకెళ్లారు. తర్వాత ఆయన మరణంతో జగన్ వెంట నడిచి 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మళ్ళీ నిలబడి విజయం అందుకున్నారు. అంబటి ఎమ్మెల్యేగా గెలవడంతో, జగన్ మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణల్లో భాగంగా అంబటికి పదవి రాలేదు. అయినా పార్టీలో అంబటి ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదు.

                                                                                    

అటు ప్రతిపక్ష టీడీపీని కట్టడి చేయడంలో అంబటి ముందున్నారు. మీడియా ముందు అవ్వోచ్చు, అసెంబ్లీలో కావొచ్చు బాబు బ్యాచ్‌ని ఏకీపారేస్తారు. తనదైన ప్రాసలతో టీడీపీకి కౌంటర్లు ఇస్తారు. అయితే ఈయన ఎక్కువ మీడియాలో ఉంటూ, ప్రజల్లో తక్కువ ఉంటున్నారనే వాదన కూడా ఉంది. ఇక సత్తెనపల్లిలో ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి లోటు లేదు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం సత్తెనపల్లిలో వైసీపీ మంచి విజయాలు సాధించింది.


అయితే ఎప్పటినుంచో వైఎస్ ఫ్యామిలీకి మద్ధతుగా ఉంటున్న అంబటి...త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఏమన్నా ఛాన్స్ దక్కదా అని చూస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత ఒక్కరే జగన్ కేబినెట్‌లో ఉన్నారు. దీంతో నెక్స్ట్ ఈ జిల్లాకు ఒకటి లేదా రెండు మంత్రి పదవులు దక్కే అవకాశముంది. ఇక అప్పుడు ఛాన్స్ కొట్టేయాలని గుంటూరు ఎమ్మెల్యేలు చూస్తున్నారు. అందులో అంబటి కూడా మంత్రి పదవిపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. మరి చూడాలి ఈసారైనా అంబటిని జగన్ కరుణిస్తారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: