మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. పార్టీ పరంగానే కాక, కుటుంబ పరమైన విషయాలను కూడా తన అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు యాంగ్రీ పొలిటికల్ లీడర్‌గా ప్రత్యర్థులపై కౌంటర్లతో దాడి చేస్తున్నారు. మరికొన్ని సార్లు సాఫ్ట్ ఫ్యామిలీ పర్సన్‌లా తన అనుభవాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన ఈ మధ్యన ప్రారంభించిన ‘మన చానల్ మన ఇష్టం’ వేదికగా తన అభిప్రాయాలను ప్రతి రోజూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా తన పిల్లల గురించి, పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత గురించి అనేక విషయాలను చెబుతున్నారు.

పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని చెప్పిన నాగబాబు.. వరుణ్ తేజ్, నిహారిక అంటే తనకెంతో ఇష్టమని, వారు కోరింది ఏనాడూ కాదనలేదని చెప్పారు. ‘నేను గొప్పగా ఫీలింగ్స్‌ని పంచుకోలేకపోవచ్చు.. కానీ పిల్లలకు ప్రేమను పంచడంలో బెటర్ అనే అనుకుంటాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలను నిరుత్సాహపరచకూడదు. వాళ్లు చేసింది చిన్న పనే అయినా వెన్నుతట్టి ప్రోత్సహిస్తే చాలు. వారిలో అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సులువుగా ఉన్నత శిఖరాలను అధిరోహించే ధైర్యాన్నిస్తుంది. అంతేకానీ చిన్న విషయమే కదా.. ఈ మాత్రం దానికే ఎందుకంత ఫీల్ కావడం..? అని నిరుత్సాహపరిస్తే భవిష్యత్తులో వాళ్లు ఏ పని చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి.

నిజానికి నేను.. వరుణ్‌ని పోలీస్‌గా, నిహారికను డాక్టర్‌గా చూడాలనుకున్నా. అది కేవలం నా కోరిక మాత్రమే. కానీ వాళ్లు సినీ ఇండస్ట్రీపై మక్కువ చూపారు. అలాగని నా అభిప్రాయాన్ని ఏ రోజూ పిల్లలపై రుద్దలేదు. అందుకే వరుణ్, నిహారిక ఎప్పుడూ నా మాటకు గౌరవం ఇస్తారు. వారి అభిప్రాయాలను నేను కూడా ఎంతో గౌరవిస్తాను. మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని అలాగే పెంచారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఎప్పుడూ ఆలోచించాలి. వారికి నచ్చిన వైపు ప్రోత్సహించాలి’ అంటూ అభిమానులకు నాగబాబు వివరించారు.

అంతేకాకుండా పిల్లలకు ఇంటికి సంబంధించిన కొన్ని బాధ్యతలు అప్పగించాలని, ముఖ్యంగా వాళ్ల రూమ్, బాత్ రూమ్ శుభ్రంగా పెట్టుకోవడం నేర్పించాలని అప్పుడే వాళ్లకు పనిమనుషుల విలువ తెలిసి వస్తుందని, వారికి కూడా గౌరవం ఇస్తారని, అలాగే పిల్లలు ఎక్కువగా ఎవరో ఒకరిపై ఆధారపడకుండా జీవించే శక్తి పెంచుతుందని నాగబాబు చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: