హుజురాబాద్ ఉపఎన్నికల నగారా మోగడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఎమ్మెల్సీల మీదకు మళ్లింది. తెలంగాణలో ఇప్పటికే ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం ఈ ఏడాది జూన్‌లోనే ముగిసింది. కాగా కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్‌లు విడుదల చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో కేసీఆర్ ఆ స్థానాల భర్తీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో బలాబలాలను బట్టి ఖాళీ అయిన ఆరుకు ఆరు స్థానాలు మరోమా రు టీఆర్ఎస్ పార్టీకే దక్కుతాయి. అధినేత ఆశీస్సులు ఉంటే చాలు పెద్దల సభలో అడుగు పెట్టొచ్చు. దాంతో ఆశావహులంతా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తయిన వారిలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం కూడా ముగిసింది. అయితే ఆ స్థానంలో ఇప్పటికే పాడి కౌశిక్‌ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ కేబినెట్ చేసిన తీర్మానం గవర్నర్‌ దగ్గర పెండింగులో ఉంది. ఎమ్మెల్యే కోటాలోని ఆరు స్థానాల కోసం అధికార పార్టీకి చెందిన నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా పావులు కదుపుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలు ఎమ్మెల్సీ వస్తుందనే గంపెడాశతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురు చూస్తున్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ.. మరోవైపు ఖాళీ అయిన స్థానంలో అవకాశం కల్పించాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సీఎంకు సన్నిహితంగా ఉన్న నాయకులతో పావులు కదుపుతున్నారు. అయితే పదవీకాలం ముగిసిన వారిలో ఎంతమందికి రెన్యూవల్ చేస్తారు? కొత్తగా ఎంత మందికి ఇస్తారనే దానిపై పార్టీలో వాడివేడిగా చర్చ సాగుతోంది.

ఇదిలాఉంటే, ఉద్యమ కాలంలో పార్టీ కోసం పనిచేసి ఏ పదవీ లేకుండా కొనసాగుతున్న విధేయులు, సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా ప్రాధాన్యాలు వంటి లెక్కలు వేసుకుని గులాబీ బాస్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు గులాబీ నేతలు చెబుతున్నారు.  గతంలో పదవులు అనుభవించిన వారికి కాకుండా యువతకు అవకాశాలు కల్పించాలని, చురుగ్గా పనిచేసేవారికి ప్రాధాన్యం ఇస్తే పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు సీనియర్లు, ఇటు కొత్తవారికి అవకాశం కల్పించాలన్నది హైకమాండ్‌ ఆలోచనగా ఉందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే భర్తీపై ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ షెడ్యూల్ విడుదల అవగానే పేర్లను అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఆశావహులు మాత్రం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నా రు. కేసీఆర్ దృష్టిలో పడేందుకు శ్రమిస్తున్నారు. మరి వారి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో, కేసీఆర్‌ కరుణ ఎవరి మీద ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: