దేశ ప్రజల హృదయాల్లో సర్దార్ పటేల్ చిరకాలం గుర్తుండిపోతారని ప్రధాన మోడీ తెలిపారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆయన స్ఫూర్తితోనే దేశం ఇప్పడు ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొంటోందని అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని సందేశమిచ్చారు. గడిచిన ఏడేళ్లలో దేశంలో పనికిరాని చట్టాలను తొలగించినట్టు ప్రధాని మోడీ ఈ సందర్భంగా చెప్పారు.

బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. తాను ఎంతగానో అభిమానించే నాయకుడి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్టు తెలిపారు. 560కు పైగా రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్ లో శాంతియుతంగా ఏకీకృతం చేసి.. బృహత్తర విజయాలకు నాంది పలికారని వెంకయ్య పేర్కొన్నారు.

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా.. కేంద్రమంత్రి అమిత్ షా ఘన నివాళులర్పించారు. ఈ మేరకు గుజరాత్ లోని కేవాడియాలో ఉన్న ఐక్యతా విగ్రహం దగ్గర పుష్పాలతో నివాళులర్పించారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా బలగాల పరేడ్ లో అమిత్ షా పాల్గొని.. వారినుద్దేశించి ప్రసంగించారు.

ఇక సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. 554 భారతీయ రాష్ట్రాలను ఏకం చేసి.. బ్రిటీష్ పాలనలోని ఇండియాను ఒకే దేశంగా మార్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సర్దార్ పటేల్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోలీసు అధికారులపై రాజకీయాల ప్రభావం గురించి సర్దార్ పటేల్ చెప్పిన మాటలను కూడా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. మొత్తానికి యావత్ దేశం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటోంది. ఆయన గొప్ప నాయకుడంటూ కొనియాడుతోంది. దేశంలోని పలు చోట్ల పటేల్ కు నివాళులర్పిస్తున్నారు వివిధ పార్టీల నాయకులు, ప్రజలు.










మరింత సమాచారం తెలుసుకోండి: