
మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సొంత నియోజకవర్గం కూడా మైలవరం. గత ఎన్నికల్లో జోగి రమేష్ మైలవరం నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ కోసం మైలవరం సీటు త్యాగం చేసి జోగి రమేష్ పెడన నుంచి పోటీ చేశారు. మైలవరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది.
ఇక్కడ నుంచి టిడిపి విజయం సాధించింది. ఈ ఎన్నికల తర్వాత నియోజకవర్గ వైసీపీలో విభేదాలు బయట పడుతున్నాయి. ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్, జోగి రమేష్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు బయటకు వస్తోంది. కొండపల్లి మున్సిపాలిటీలో ఓటమి తర్వాత మైలవరం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పామర్తి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. అలాగే ఏఎంసీ చైర్మన్ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
తనకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని... అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పట్టించుకోవడం మానేశారని ఆయన ఆరోపిస్తున్నారు. జోగి రమేష్ వర్గానికి చెందిన పామర్తి శ్రీనివాసరావుకు స్థానికంగా మంచి పట్టు ఉంది. ఆయన కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. అయితే ఎమ్మెల్యే మాత్రం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ ప్రకటించడంతో వైసీపీలో కలకలం రేగింది.