వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి... విజయం సాధించారు నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన ఏడాది నుంచే సొంత పార్టీ నేతలపైన ఎదురు దాడి చేశారు. ఆ తర్వాత ఓ బహిరంగ సభలో అయితే జగన్ నాయకత్వంపైనే కామెంట్లు చేశారు. అంతే... నాటి నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన, వైసీపీ ప్రభుత్వంపైనా, సొంత పార్టీ నేతలపైన కామెంట్లు చేయడం మొదలు పెట్టారు రఘురామ కృష్ణంరాజు. ఒక దశలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు రఘురామ. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు కూడా. అయితే జగన్‌తో రఘురామకు ఎందుకు విభేదాలు వచ్చాయనే విషయం చాలా మందికి తెలియదు. చివరికి సొంత పార్టీ నేతలకు కూడా తెలియని పరిస్థితి. వారిద్దరి మధ్య ఏమైంది అని అడిగితే... ఏమో తెలియదు అంటూ వైసీపీ నేతలు.

ఈ ప్రశ్నలకు రఘురామ కృష్ణంరాజు స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. దేశంలో ఓ ఎంపీపైన తొలిసారి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు ఆర్ఆర్ఆర్. తనను తీవ్రంగా హింసించారని... దీని వెనుక పార్టీలో ఓ కీలక నేత హస్తం ఉందన్నారు. అయితే ఆ నేత పేరు మాత్రం రఘురామ బయట పెట్టలేదు. తొలి నుంచి జగన్ తనతో ఎంతో సఖ్యతగా ఉండేవారని... కానీ కొంత మంది నేతలు కావాలనే తనపై జగన్‌కు లేనిపోనివి చెప్పి తమ మధ్య గ్యాప్ వచ్చేలా చేశారని కూడా ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌లోని 350 ఏ ప్రకారం ప్రాథమిక విద్యను మాతృభాషలో చదువుకునే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో తాను ప్రస్తావించానన్నారు. అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా ఈ అధికరణను అనుసరించేలా చూడాలని కూడా కేంద్ర విద్యా శాఖ మంత్రిని తాను స్వయంగా కోరినట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. అప్పటి నుంచే తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని రఘురామ వెల్లడించారు. అసలు అలా ఎందుకు చేశావంటూ అదో రోజు ఎంపీ మిథున్ రెడ్డి తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారని.... అసలు తాను ఏం తప్పు చేశానో ఇప్పటికీ తెలియటం లేదన్నారు ఆర్ఆర్ఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: