వైసీపీ రెబెల్‌ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. వైసీపీ అధినాయ‌క‌త్వానికి కొంత‌కాలంగా ఆయ‌నో కొర‌కరాని కొయ్య‌.  సొంత పార్టీ ప్ర‌భుత్వంపై నిరంత‌రం ఆయ‌న చేస్తున్న విమర్శ‌లను స‌మ‌ర్థంగా తిప్పికొట్టేందుకు పార్టీ ప్ర‌త్యేకంగా కొంద‌రు నాయ‌కుల‌ని నియోగించాల్సిన ప‌రిస్థితి. ఆయ‌నపై కేసులు పెట్టి అరెస్టు చేసినా ర‌ఘురామ‌కృష్ణంరాజు ఎక్క‌డా పోరాటంలో వెనుక‌డుగు వేయ‌టం లేదు. సుప్రీం కోర్టుదాకా వెళ్లి త‌న‌పై ఏపీ ప్ర‌భుత్వం పెట్టిన కేసుల నుంచి బెయిలు పొంది బ‌య‌ట‌ప‌డిన ఆయ‌న లోక్‌స‌భ స‌భ్యుడిగా ఉన్న త‌న‌పై ఏపీ పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించారంటూ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సీబీఐ కేసుల్లో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బెయిలును ర‌ద్దు చేయాలంటూ న్యాయ‌పోరాటం చేస్తున్నారు. అంతేకాదు ఢిల్లీ స్థాయిలో ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను క‌లిసి ఏపీ ప్ర‌భుత్వ తీరుపై ఆయ‌న ప‌లుసార్లు ఫిర్యాదు చేస్తున్నారు.  నిజం చెప్పాలంటే కొన్నిసార్లు అస‌లైన ప్ర‌తిప‌క్షం ఆయ‌నేనేమో అనే స్థాయిలో ప్ర‌చారం పొందుతున్నారు. కొన్నాళ్ల‌పాటు కోర్టు తీర్పు ప్ర‌కారం లైవ్ ప్రోగ్రాంలు పెట్టి విమ‌ర్శించ‌డం విర‌మించిన ఆయ‌న ఇప్పుడు మ‌ళ్లీ వాటిని కొన‌సాగిస్తున్నారు. తాజాగా ఆయ‌న లైవ్ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ త‌న‌పై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించేలా ప్రేరేపించి ఆనందించినవారిపై ప్ర‌తీకారం తీర్చుకుంటాన‌న్న‌ట్టుగా మాట్లాడారు.
 

       పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న ఆయ‌న లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీలు అంద‌రూ క‌లిసి గ‌తంలో స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ అధినాయ‌క‌త్వ‌మూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అంతేగానీ తానుగా పార్టీ నుంచి ఆయ‌న‌ను బ‌హిష్క‌రించే ప్ర‌య‌త్నం వైసీపీ చేయడం లేదు. అలా చేస్తే ర‌ఘురామ‌రాజు బీజేపీలో చేరిపోతార‌ని, ఆయ‌న బ‌లం మ‌రింత పెరుగుతుంద‌న్న భ‌యంతోనే పార్టీ ఆ ప‌ని చేయ‌డం లేద‌న్న అభిప్రాయం జ‌నంలో నెల‌కొంది. అయితే ఆయ‌న వీరి ప్ర‌య‌త్నాల‌ను రెబెల్ ఎంపీ చాలా తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. త‌న స‌భ్య‌త్వానికి వ‌చ్చిన ప్ర‌మాదం ఏమీలేద‌ని, ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌ను ప్ర‌శ్నించ‌డం పార్టీ వ్య‌తిరేక చ‌ర్య‌లుగా ప‌రిగ‌ణించ‌డం కుద‌ర‌ద‌ని తెగేసి చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పేరు వినిపిస్తే చాలు అధికార వైసీపీ నాయ‌కులకు గంగ‌వెర్రులెత్తుతోంది. ఇదిలా ఉండ‌గా ర‌ఘురామ‌కృష్ణంరాజుకు బీజేపీ పెద్ద‌ల అండ‌దండ‌లున్నాయ‌న్న ప్ర‌చారం ఇప్ప‌టికే సాగుతోంది. అయితే ఆయ‌న మాత్రం బీజేపీతోనే కాకుండా ఇటు టీడీపీతోనూ, అటు జ‌న‌సేన తోనూ కూడా స‌న్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. తిరుప‌తిలో జ‌రిగిన ఇటీవ‌ల జ‌రిగిన అమ‌రావ‌తి రైతుల స‌భ‌లో పాల్గొనడ‌మే కాకుండా, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిని ఆలింగ‌నం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ర‌ఘురామ‌కృష్ణంరాజు భ‌విష్య‌త్తులో ఏ పార్టీలో చేర‌బోతున్నారు..? వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే వైసీపీ ప్ర‌భుత్వంపై ఒంట‌రి పోరాటం చేస్తున్నారా..?  లేక ప్ర‌త్య‌ర్థి పార్టీల వ్యూహాన్ని ఆయ‌న అమ‌లు చేస్తున్నారా..?  అనే సందేహాలు అంద‌రికీ క‌లుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

RRR