వనమా రాఘవ.. ఓ పచ్చని కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వాడు.. ఓ కుటుంబ వ్యవహారంలో తలదూర్చి.. మానసికంగా క్షోభ పెట్టి.. చివరకు బాధితుడి భార్యను కోరిన నీచుడు. పాత పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమై ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవ గురించి ఇప్పుడు కొత్త కథలు కూడా బయటకు వస్తున్నాయి. బెదిరింపులు, అత్యాచారాలు, సెటిల్‌మెంట్లు మాత్రమే కాదు.. అమాయక గిరిజనుల భూములు కూడా కొల్లగొట్టిన్టు కొత్త కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.


వనమా రాఘవ అరెస్టులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకుంటున్నారు. వనమా రామకృష్ణ అనేక భూకబ్జాలు, అరాచకాలకు పాల్పడ్డాడని చెబుతున్నారు. ఈ ఘటనల్లో ఇప్పటికే కొన్నింటిపై వనమా రాఘవపై పోలీసు కేసులు నమోదయ్యాయి. వనమా రాఘవ నియోజకవర్గం కొత్తగూడెం.. ఇది ఎక్కువగా గిరిజనులు ఉండే ప్రాంతం. గిరిజనులు అడవుల్లో చెట్లు కొట్టుకుని పోడు చేసుకుని కొంత భూమిని సాగుచేసుకుంటారు.


అలాంటి భూములకు ప్రభుత్వం గతంలో అసెన్డ్ పట్టాలు కూడా ఇచ్చింది. అలాంటి భూములను వనమా రాఘవ కబ్జా చేసేవాడు.. అమాయక గిరిజనులు అడగటానికి వస్తే.. కొట్టి పంపేవాడు..  బంగారుజాల అనే అటవీ బీట్‌ పరిధిలో 50 ఎకరాల వరకూ అటవీ భూమిని రాఘవ ఆక్రమించాడని కథనాలు వస్తున్నాయి. ఈ భూములకు పక్కనే రాఘవకూ భూములు ఉన్నాయి. అందుకే సర్వే నెంబర్ల పేరు చెప్పి.. ఆ భూమిని తన భూమిలో కలిపేసుకుని సాగు చేసేవాడు.


అంతే కాదు.. ఈ బీట్‌లో వందల ఎకరాల అటవీభూమిని రాఘవ స్వాధీనం చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి అక్రమాలపై ప్రభుత్వం ఓ విచారణ కమిటీ వేస్తే కానీ వాస్తవాలు బయటకు రావు. తండ్రి అధికారం అండతో రెచ్చిపోయిన వనమా రాఘవ ఉదంతం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. రోజుకొకరు బయటకు వచ్చి అతడి ఆగడాలు వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: