ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.. మొన్నటి ఎన్నికలకు ముందు చేయని చిత్రం లేదు. వేయని వేషం లేదు. సరిగ్గా ఎన్నికల ఏడాదిలో చంద్రబాబు గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్నీ చేశారు. డ్వాక్రా చెల్లెమ్మలకు పసుపు కుంకుమ పేరిట జనం సొమ్ము పంచిపెట్టారు. రైతులకు ఓవైపు రుణమాఫీ చేయకపోయినా..కొత్తగా అన్నదాతా సుఖీభవ సొమ్ములు ఖాతాల్లో వేశారు.


నిరుద్యోగు భృతి అమలుచేశారు.. అలాంటి పరంపరలోదే అన్న క్యాంటీన్లు కూడా. అయితే ఎన్నికల ముందు ఈ పథకాన్ని హడావడిగా ప్రారంభించారు. పలు చోట్ల యుద్ధ ప్రాతిపదికన క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు దిగిపోయిన తర్వాత అనేక నిజాలు వెలుగు చూస్తున్నాయి.


పేదోడికి కడుపునిండా భోజనం రూ. 5 కే ఇస్తున్న ఈ అన్న క్యాంటీన్ల నిర్వహణ బిల్లులను చంద్రబాబు సర్కారు క్లియర్ చేయనేలేదట. సరిగ్గా ఎన్నికల ముందు అనేక పథకాల కోసం చంద్రబాబు సర్కారు ఖాజానాను విచ్చలవిడిగా వాడటంతో ఈ అన్న క్యాంటీన్ బిల్లుల చెల్లింపుకు సొమ్ము దొరకలేదు. అంటే పేదోడి భోజనం ఖర్చును కూడా చంద్రబాబు సర్కారు ఎన్నికల ప్రయోజనాలకోసమే వాడేసుకుందన్నమాట. దీంతో బకాయిలు పేరుకుపోయాయి.


ఎన్నికలకు ముందు ఎంతో హడావుడిగా, ప్రచార ఆర్భాటంతో వీటిని ప్రారంభించిన గత ప్రభుత్వం, నిర్మాణాలకు సంబంధించి దాదాపు రూ.50 కోట్లు, వీటిలో పంపిణీ చేసిన ఆహారానికి సంబంధించి మరో రూ.40 కోట్లు పెండింగ్‌లో ఉంచిందట. అంటే... ఒక్కపైసా కూడా ఇవ్వకుండా కోట్ల రూపాయల్లో అప్పుపెట్టి విపరీతంగా ప్రచారం చేసుకున్నారన్నమాట.. పేదోడి భోజనాన్ని కూడా సెంటిమెంట్ గా మార్చుకునే ప్రయత్నం చేశారన్నమాట. ఇలా ఏర్పాటు చేసిన మొత్తం క్యాంటీన్లలో 68 మాత్రమే ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయట. ఇప్పుడు వచ్చిన కొత్త సర్కారు.. వీటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొత్త పాలసీని తీసుకొస్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: