ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది 108 ఫోన్ నెంబర్.. ఆ నంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేస్తుంది. అంతవరకూ ఓకే.. మరి అదే పరిస్థితి పశువులకు వస్తే.. ఇందుకు సమాధానంగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం 102 నెంబర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పశువుల వైద్యం కోసం 102 నంబర్‌ గల వాహనాలు వచ్చే ఏడాది నుంచి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు


పశుసంవర్ధక, మత్స్యశాఖలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.వెటర్నరీ ఆస్పత్రులు, క్లినిక్‌లలో సదుపాయాలు కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలన్నారు. పశువులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, దీని వల్ల క్రమ తప్పకుండా వ్యాక్సిన్స్‌ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. పశువుల పెంపకాల్లో సంప్రదాయ పద్ధతులకు పెద్దపీట వేయాలని సూచించారు.


గ్రామాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా వలంటీర్లను భాగస్వాములను చేయాలన్నారు. పశువుల మందుల కొనుగోలులో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో గుర్తించిన ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణాలపై ముఖ్యమంత్రి చర్చించారు. జెట్టీలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. దాదాపు 12 జెట్టీల నిర్మాణానికి సన్నాహాలు, మూడు మేజర్‌ పోర్టుల నిర్మాణానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.


మచిలీపట్నంను మేజర్‌ పోర్టుగా తీర్చిదిద్దుతామని జగన్ చెప్పారు. భీమిలి సమీపంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపైనా సీఎం చర్చించారు. మత్స్యకారుల గురించి ప్రభుత్వం ఏం చేస్తుందో వివరించాలన్నారు. పనుల్లో పారదర్శకత ఉండాలన్నారు. అవినీతి లేకుండా చూడాలన్నారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌పై ఒత్తిడి తగ్గించాల్సి ఉందని ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. రైతులకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సీఎం సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: