తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హ‌త్య‌లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశ‌మంత‌టా ఈ హ‌త్య‌పై విస్తృత చ‌ర్చ జ‌రుగుంది. ఈ విషాద సంఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సు క‌లచివేస్తుంది. రాజ‌కీయ నాయ‌కులు, సినీ సెల‌బ్రిటీల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు దీనిపై త‌మ స్పంద‌న గ‌ట్టిగా వినిపిస్తున్నారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు కలిసి ప్రియాంకపై సామూహిక అత్యాచారం చేసిన అనంతరం ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 24 గంటల్లోపే పోలీసులు ఈ కేసును చేధించారు. ఈ ఐదుగురిలో నలుగురు యువకులను అరెస్టు చేయగా, మరో యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ హ‌త్య రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. ఓ మ‌హిళా నేత ఈ హ‌త్య‌కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి లింక్ పెట్టేశారు.

 


ప్రియాంక హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. హైవేలపై 24 గంటల పెట్రోలింగ్ ఏమైందో ప్రభుత్వం చెప్పాలని ఆమె అన్నారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ పిట్టగా మారారని బీజేపీ నేత డీకే అరుణ ఎద్దేవా చేశారు. ప్రియాంక కేసును కేటీఆరే పర్యవేక్షిస్తానని ట్విట్ట‌ర్లో కేటీఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. అత్యాచారాలపై ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లయినా మహిళ కమిషన్ ఏర్పాటు చేయలేదని తెలిపారు. కేసీఆర్‌ వెంటనే మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె వ్యాఖ్యానించారు.

 

ఇదిలాఉండ‌గా, ప్రియాంక కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకరెడ్డి హత్య బాధాకరమన్నారు. పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారని నేటి సాయంత్రానికల్లా కేసు దర్యాప్తు పూర్తవుతుందని తెలిపారు. కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగిస్తామన్నారు. నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తామన్నారు. ఎవరు ప్రమాదంలో ఉన్నా డయల్‌ 100 నంబర్‌కు ఫోన్‌ చేయాల్సిందిగా సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: