ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది . ఇప్పటికే జీఎన్ రావు కమిటీ సూచనల మేరకు , రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటు చేయనున్నట్లు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఇప్పటికే ప్రతిపాదించిన విషయం తెల్సిందే . అయితే బోస్టన్ కమిటీ నివేదిక కూడా పరిశీలించిన తరువాత అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రివర్గ సమావేశం లో తీర్మానించారు .

 

 రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ కన్వీనర్ గా అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు . ఈ కమిటీ లో మంత్రులు పేర్ని నాని , మోపిదేవి వెంకటరమణ ,మేకతోటి  సుచరిత , బొత్స సత్యనారాయణ , ఆదిమూలపు సురేష్ , కన్నబాబు, కొడాలినాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ , వైస్సార్ కాంగ్రెస్ నాయకుడు గౌతమ్ రెడ్డి   తోపాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ , ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం లు ఉన్నారు . ఈ కమిటీ జీఎన్ రావు నేతృత్వం లోని నిపుణుల కమిటీ సూచనలతోపాటు , బోస్టన్ కమిటీ నివేదికను పరిశీలించి , రాజధాని ఏర్పాటుపై మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది .

 

 అత్యున్నత స్థాయి కమిటీ , ఈ రెండు కమిటీల నివేదికలోని సాధ్యసాధ్యాలను పరిశీలించనుంది  . జనవరి చివరి నాటికీ , రాష్ట్ర రాజధానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు . జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ లు కూడా విశాఖ ను రాజధానిగా ఏర్పాటు చేయాలని సూచించడంతో , అత్యున్నతస్థాయి కమిటీ కూడా విశాఖ వైపే మొగ్గు చూపే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి . ఇక అమరావతి , కర్నూల్ పట్టణాలను జగన్ ప్రతిపాదించినట్లుగా శాసన , న్యాయ రాజధానులుగా కొనసాగే అవకాశాలున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: