వయస్సయిపోయినా, అనారోగ్యంతో ఉన్నా సరే వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు మాత్రమే పోరాటం చేయాలి. లేకపోతే పార్టీ కనుమరుగైపోవటం ఖాయమేనా ? తెలుగుదేశంపార్టీ పరిస్ధితిపై జనాల్లో ఇపుడిదే అంశంపై చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నపుడు భాగస్వామ్యం కోసం వెయ్యిమంది చంద్రబాబునాయుడు మీదకు ఎగబడతారు. అదే ప్రతిపక్షంలో ఉంటే మాత్రం చాలామంది అడ్రస్ కనబడరు. ఇపుడు పార్టీలో జరుగుతున్నదిదే.

 

కావాలంటే గడచిన తొమ్మిది నెలలుగా పార్టీలో ఏమి జరుగుతోందో ఎవరైనా గమనించచ్చు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేతిలో చంద్రబాబునాయుడు చావుదెబ్బ తిన్నాడు. అప్పటి నుండి పార్టీ నేతలు ఏదో ఉన్నామంటే ఉన్నామనిపించుకుంటున్నారంతే. పార్టీలో  చెప్పుకోవటానికి చాలామందే సీనియర్ నేతలున్నారు. కానీ చంద్రబాబు లాగ సొంతంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలంటూ రోడ్లపైకి వస్తున్న వాళ్ళెంతమంది ?

 

నిజానికి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎప్పుడూ ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ సర్వం సహా తాను మాత్రమే ప్రచారంలో ఉండాలని చంద్రబాబు కోరుకుంటాడు. అధికారంలో ఉన్నంత కాలం పర్వాలేదు కానీ ప్రతిపక్షంలో కూర్చుంటే మాత్రం గోవిందా. ఇపుడు జరుగుతున్నది ఇదే అని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. జగన్ కు వ్యతిరేకంగా ఏ పోరాటం చేయాలన్నా, ఆందోళనకు పిలుపివ్వాలన్నా చంద్రబాబు మాత్రమే చేయాలి. తమ జిల్లాకు చంద్రబాబు వస్తున్నాడంటే ఏదో మొక్కుబడిగా కొందరు నేతలు హాజరై తర్వాత అడ్రస్ ఉండటం లేదు.

 

పార్టీలో ప్రస్తుత పరిస్ధితికి కారణం ఏమిటంటే ద్వితీయ నాయకత్వాన్ని ఎదగనీయకుండా అడ్డుకోవటమే. ఒకపుడు తనకు అడ్డు వస్తారని, ఇపుడు లోకేష్ ను మించి పోతారన్న భయం వల్లే చంద్రబాబు ఇంకో నేతను ఎవరినీ ఎదగనీయలేదు. గట్టి నేతలు అనుకున్న వారిని చాలా కాలం క్రితమే పార్టీలో నుండి తరిమేశారు. దాంతో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్టీలో నాయకత్వ సమస్య బాగా పీడిస్తోంది. అంటే ఎంతకాలమైనా పార్టీకి చంద్రబాబే దిక్కని తేలిపోయింది. మరి ఏ కారణం వల్లైనా ఆయన పక్కకు తప్పుకునే పరిస్ధితి వస్తే ....

మరింత సమాచారం తెలుసుకోండి: