కడప జిల్లాలో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగలబోతోంది. దీని దెబ్బకు జిల్లాలో తెలుగుదేశంపార్టీ వాష్ అవుటవ్వటం ఖాయమనే అనిపిస్తోంది. విషయం ఏమిటంటే జిల్లాలో మొదటి నుండి పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టిడిపికి రాజీనామా చేసేసి వైసిపిలో చేరటానికి రంగం రెడీ అయిపోయిందని సమాచారం. రెండు మూడు రోజుల్లో టిడిపికి రాజీనామా చేయటానికి రామసుబ్బారెడ్డి డిసైడ్ చేసుకున్నాడట.

 

నిజానికి జమ్మలమడుగుకు చెందిన రామసుబ్బారెడ్డి వైసిపిలో చేరుతాడనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్నదే. ఎప్పుడైతే వైసిపి తరపున గెలిచిన ఆది నారాయణరెడ్డి టిడిపిలోకి ఫిరాయించి మంత్రిపదవి తీసుకున్నారో అప్పటి నుండే రెడ్డి టిడిపిని వదిలేస్తారనే ప్రచారం మొదలైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కూడా రామసుబ్బారెడ్డి పార్టీ మార్పిడిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  కాకపోతే ఎప్పటికప్పుడు చంద్రబాబు సర్దుబాటు చేస్తుండటం వల్ల పార్టీ మారే విషయం వాయిదా పడుతోంది.

 

అయితే తాజాగా చంద్రబాబు-రామసుబ్బారెడ్డికి మధ్య ఏమి జరిగిందో స్పష్టంగా తెలీదు. స్ధానిక సంస్ధల ఎన్నికల వేడి పుంజుకుంటున్న సమయంలో రెడ్డి టిడిపిని వదిలేస్తారనే ప్రచారం జిల్లాలో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒకటి రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మాజీ మంత్రి అపాయిట్మెంట్ కూడా అడిగినట్లు చెబుతున్నారు. అదే సమయంలో రెడ్డి వైసిపిలో చేరటాన్ని పార్టీ ఎంఎల్ఏ డాక్టర్ సుధీర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇదే విషయం చర్చ జరిగినపుడు జగన్ డాక్టర్ కు గతంలోనే సర్దిచెప్పినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే మాజీమంత్రి పార్టీ మార్పిడి వ్యవహారం చాపక్రింద నీరు లాగ జరుగుతున్నదనే విషయం తెలిసిపోయింది.

 

అసలే మొన్నటి ఎన్నికల్లో పదికి పది స్ధానాలూ వైసిపినే గెలుచుకుంది. అప్పటి నుండి జిల్లాలో పార్టీ ఉనికే పెద్దగా లేదనే చెప్పాలి. అధికారంలో ఉన్నపుడు వైసిపి నేతలను ఇబ్బంది పెట్టిన టిడిపి నేతలు మొన్నటి ఎన్నికల తర్వాత చాలా వరకూ అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు. అలాంటిది మిగిలిన రామసుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా స్ధానిక సంస్ధల ఎన్నికల సమయంలోనే పార్టీకి రాజీనామా చేస్తే ఇక చెప్పాల్సిన పనేలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: