మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ ప్రభుత్వంపై కత్తి వేలాడుతోంది. అయితే, రాజీనామాలు ఆమోదించాలంటే ఆ ఎమ్మెల్యేలంతా తనను వ్యక్తిగతం కలవాల్సిందే అంటున్నారు అసెంబ్లీ స్పీకర్‌. మరోవైపు... రాజీనామా చేసిన వాళ్లలో 13 మంది కాంగ్రెస్‌ వీడడం లేదని హామీ ఇచ్చారంటూ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌. దీంతో మధ్యప్రదేశ్‌లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. 

 
మధ్యప్రదేశ్‌లో రాజకీయ అనిశ్చితిపై ఉత్కంఠ కొనసాగుతోంది. జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా, తదనంతర పరిణామాలతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది. అయితే, సీఎం పీఠం చేజారకుండా కాపాడుకునే ప్రయత్నాలు పడింది కాంగ్రెస్‌.  మరోవైపు... ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బలపరీక్ష జరిగే వరకూ ఎమ్మెల్యేలను క్యాంప్‌లకు తరలించి కాపాడుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్‌, బీజేపీ.  


 
ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వాళ్లను మినహాయించి... మిగతా వాళ్లను జైపూర్‌కు తరలించింది కాంగ్రెస్‌. ఇందులో స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జైపూర్ రిసార్ట్స్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య వీళ్లను ఉంచారు. అటు బీజేపీ కూడా ఎమ్మెల్యేలను గుర్‌గావ్‌ తరలించింది. గుర్‌గావ్‌లోని ఐటీసీ గ్రాండ్ భారత్‌లో వీళ్లను ఉంచారు. 


   
మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బెంగళూరులో క్యాంప్ పెట్టి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆరుగురు మంత్రులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఆరుగురిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే తిరుగుబాటు చేసిన మిగతా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరలేదు. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానంటున్నారు మధ్యప్రదేశ్ స్పీకర్ ప్రజాపతి. చట్టం ప్రకారం రాజీనామా చేసిన ఎమ్మెల్యే ముందుగా స్పీకర్‌ను కలిసి... ఆ విషయం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాతే... వాళ్ల రాజీనామాలకు గల కారణాలను, వాస్తవాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు స్పీకర్ ప్రజాపతి. 


     
మరోవైపు... మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సారథ్యంలో సర్కార్ ఏర్పాటు చేస్తామంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే, జ్యోతిరాదిత్య సింధియా మేనత్త యశోధరా రాజే సింధియా. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడాన్ని ఘర్ వాపసిగా అభివర్ణించారు. తమ కుటుంబ సభ్యులు మొత్తం ఒకే పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు యశోధరా రాజే సింధియా.    


 
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయినా... మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఆ పార్టీ నేతలు. కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదంటున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌. 22 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 13 మంది కాంగ్రెస్‌ను వీడడం లేదని చెప్పారంటున్నారాయన. సింధియాను రాజ్యసభకు ఎంపిక చేసేలా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే వాళ్లంతా బెంగళూరు వెళ్లారు తప్ప... బీజేపీలో చేరే ఉద్దేశం వాళ్లకు ఏమాత్రం లేదంటున్నారాయన.  అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో కచ్చితంగా నెగ్గి తీరతామని చెబుతున్నారు దిగ్విజయ్‌ సింగ్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: