తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వామ‌పక్ష నేత‌లంటేనే, వారి ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు అంటేనే ఓ రేంజ్‌లో దూరం పెట్టేస్తారు. ఆ పార్టీల‌కు తోక పార్టీలు అని పేరు కూడా పెట్టేశారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా వారిని టార్గెట్ చేస్తుంటారు. అయితే, తాజాగా అదే ఎర్ర‌చొక్కాల పార్టీ ముఖ్య‌నేత‌, జాతీయ నాయ‌కుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్ర‌శంసించారు. ఎందుకో తెలుసా? ప‌్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి మంట పుట్టించే ప‌నిని తెలంగాణ సీఎం చేసినందుకు!. ఔను. 

 

స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నాం...సీఏఏపై కేంద్రం పున:సమీక్షించుకోవాలి అని అసెంబ్లీ వేదిక‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లౌకిక పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ టీఆర్ఎస్ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏ దేశానికైనా  పౌరసత్వం ఉండాలి… దానికో చట్టం ఉండాల్సిందేనని సీఎం కేసీఆర్ చెప్పారు. సీఏఏని ఎవరైనా వ్యతిరేకిస్తే వారు దేశద్రోహులు, పాకిస్థాన్ ఏజెంట్లు అవుతారా అని ప్రశ్నించారు. దేశంలోకి చొరబాటుదారులను ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందేనని.. చొరబాటుదారులను ఎవరూ అనుమతి ఇవ్వాల‌ని  అంటున్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశ సరిహద్దుల వెంట గోడ కడతామంటే.. పూర్తి మద్దతు తెలుపుతామని అన్నానరు. దేశ ప్రజలు క్షేమంగా ఉన్నారంటే.. కంటినిండా నిద్రపోతున్నామంటే మన సైన్యం త్యాగఫలమేనని అన్నారు.  కుల, మత, వర్గ, వర్ణ విభేదాలకు అతీతంగా కొనసాగుతామని ప్రమాణం చేస్తాం. ముస్లింలను మినహాయించి చట్టం అనడం ఎంతవరకు సబబు. ఎంఐఎం, మేము కలిసి పనిచేస్తాం..దాంట్లో అనుమానం లేదు. కొన్ని విషయాల్లో మజ్లిస్‌, మా అభిప్రాయాలు ఒకటిగా ఉండొచ్చు. కానీ, కొన్ని విషయాల్లో విభేదిస్తాం.. మా అభిప్రాయాలు మావి.'అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పౌర‌స‌త్వ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కి వ్య‌తిరేకంగా తెలంగాణ శాస‌న‌స‌భ  తీర్మానం ఆమోదించింది.

 

కాగా, కేసీఆర్ కామెంట్లు, అసెంబ్లీలో తీసుకున్న నిర్ణ‌యంపై సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి స్పందించారు. సీపీఎం పొలిట్‌బ్యూరో స‌మావేశం రెండు రోజులు ఢిల్లీలో జ‌రిగింది. అనంత‌రం సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ... సీఏఏ అంశం హిందూ-ముస్లిం అంటూ రెండు మ‌తాల‌కి సంబంధించిన‌ది కాద‌ని ఆయ‌న చెప్పారు. ఈ చ‌ట్ట యావ‌త్ దేశానికే వ్య‌తిరేక‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. నిరాక్ష్య‌రాస్యులైన పేద ప్ర‌జానీకాన్ని పుట్టిన తేదీ త‌దిత‌ర‌ దృవపత్రాల కోసం ఇబ్బంది పెట్ట‌డం స‌రికాద‌ని సీతారాం ఏచూరి అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స‌భ‌లో ఎన్పీఆర్ ప్ర‌క్రియ‌కి ఎటువంటి స‌ర్టిఫికేట్ అవ‌స‌రం లేద‌ని చెప్పార‌ని... కానీ, కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో మాత్రం ప్ర‌క్రియ‌కి స‌ర్టిఫికెట్‌లు అవ‌స‌రం అని చెప్పారు.  భార‌త రాజ్యాంగ మూల సూత్రాల‌కి విఘాతం కలిగిస్తున్న చ‌ట్టాన్ని ప్ర‌తి రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌తిరేకించాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: