కరోనా వల్ల నష్టపోయిన రంగాల్లో మీడియా ఒకటి. ప్రత్యేకించి ప్రింట్ మీడియా కరోనా ధాటికి కుదేలైంది. ప్రింట్ చేసిన పేపర్ కొనే నాధులు కరవయ్యారు. చందాదారులకు సైతం అందించే పరిస్థితులు లేవు. మరోవైపు జనం కూడా పేపర్ ద్వారా వైరస్ వస్తుందేమో అన్న భయంతో చాలా మంది పేపర్ పట్టుకోవడం మానేశారు. ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

 

 

అదే పేపర్ డిజిటల్ రూపంలో లభిస్తున్నప్పుడు రిస్కు తీసుకోవడం ఎందుకన్న లాజిక్ ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రింటు మీడియా కుదేలవుతోంది. కొన్ని పత్రికలైతే ప్రతిష్టకు పోవడం ఎందుకని ప్రింటింగ్ కూడా ఆపేశాయి. ఇలాంటి సమయంలో ఇదే అదనుకుగా కొన్ని పత్రికలు తమ సిబ్బందిపై కరోనా సాకుతో వేటు వేస్తున్నాయి. అదేమంటే కరోనా అని సాకులు చెబుతున్నాయి. గ‌త నెల 22 నుంచి లాక్‌డౌన్ చేప‌డితే క‌నీసం వారం కూడా గ‌డ‌వక‌నే తెలుగులో ఆంధ్రజ్యోతి ప‌త్రిక‌లో ఏకంగా 150 మంది జ‌ర్నలిస్టుల‌ను తొల‌గించిందని వార్తలు వచ్చాయి.

 

 

అంటే కనీసం నెల రోజులు కూడా నష్టాలను భరించే పరిస్థితిలో ఆంధ్రజ్యోతి లేదన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగంలో ఉన్న జర్నలిస్టుల వేతనాల్లోనూ కోతలు వేస్తున్నాయి. ఓవైపు ఇలా ఉద్యోగుల గొంతు కోస్తున్న పత్రికలు.. మళ్లీ జాతీయ స్థాయిలో ఒక్కటై ఆదుకోండంటూ కేంద్రాన్ని వేడుకుంటున్నాయి. లాక్‌డౌన్‌తో ప్రక‌ట‌న‌ల ఆదాయం ఆగిన నేప‌థ్యంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న త‌మ ప‌రిశ్రమ‌ను ఆదుకోవాల‌ని వేడుకుంటున్నాయి. ప‌త్రిక‌లు మ‌నుగ‌డ సాగించేందుకు స‌హ‌క‌రించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ లేఖ రాసింది.

 

 

మరి ఉద్యోగులను కనీసం నెల రోజుల పాటు కూడా ఓపిక లేకుండా భరించలేకపోతున్న ఈ పత్రికల యాజమాన్యాలకు కేంద్రం మాత్రం ఎందుకు సహకరించాలన్న వాదన వినిపిస్తోంది.ఎంత సేపూ యాజ‌మాన్యాలు తమ ప్రయోజ‌నాలే త‌ప్ప ఉద్యోగుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించ‌డం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: