మేక్ అమెరికా గ్రేట్ అగైన్.. అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన‌ప్ప‌టి నుంచి అమెరికా వ‌ల‌స విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. వీసాల జారీ నిబంధ‌న‌లు క‌ఠినత‌రం అయ్యాయి. హెచ్ 1 బీ,హెచ్ 2 బీ,జేఎల్ జే, స‌హా కొన్ని ర‌కాల వీసాల జారీని ఏడాది చివ‌రి వ‌ర‌కు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఇక‌పై  ప్ర‌తిభ ఆధారంగానే  వ‌ల‌స విధానం ఉంటుంద‌ని ట్రంప్‌ స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో భార‌తీయ వృత్తి నిపుణుల‌పై ర‌ద్దు ప్ర‌భావం ఎంతలా ఉంటుందో అన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌, టెక్ మ‌హీంద్రా, స్థానిక దిగ్గ‌జాలైన‌ గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్ ......హెచ్‌-1బి, హెచ్‌-2బి, ఎల్‌, జే వంటి వీసాల‌ను విస్తృతంగా ఉప‌యోగిస్తాయి. అమెరికాలో వృత్తి నిపుణుల‌కు భారీ వేత‌నాలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే త‌క్కువ వేత‌నాల‌కే ప‌నిచేసే ప్ర‌తిభావంతులైన భార‌తీయుల‌ను ఎక్కువ‌గా ఎంపిక చేస్తాయి. వారితో  హెచ్‌-1బి వీసాల‌కు విస్తృతంగా ద‌ర‌ఖాస్తులు చేయిస్తాయి.  అందుకే వీటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు వీటిని తాత్కాలిక ర‌ద్దు చేయ‌డంతో ఆయా కంపెనీల్లో కొంత కలవరం మొదలైంది.

 

ట్రంప్  నిర్ణ‌యంతో భార‌తీయ నిపుణులు, కంపెనీల‌కు న‌ష్టం త‌క్కువేన‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. సాధార‌ణంగా భార‌తీయ కంపెనీలు ఉద్యోగుల విష‌యంలో 80:20 శాతం నిబంధ‌న‌ను పాటిస్తాయి. అంటే ఏదైనా ఒక ప్రాజెక్టుకు ప‌ది మందిని ఎంపిక చేస్తే ఎనిమిది మంది భార‌త్‌లో ఇద్ద‌రు విదేశాల్లో ప‌నిచేస్తారు. వీరికి మాత్ర‌మే వీసాలు అవ‌స‌రం. ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి ఈ ప‌ద్ధ‌తికి కంపెనీలు స్వస్తి చెప్పి అమెరిక‌న్ల‌ను ఎంపిక చేయ‌డం మొద‌లుపెట్టాయి. హెచ్‌-1బి వీసాల‌పై ఆధార‌ప‌డ‌టం త‌గ్గించాయి. ఇన్ఫోసిస్ 62.9%, విప్రో 69.5%, హెచ్‌సీఎల్ 67.7%, టెక్ మ‌హీంద్రా 45 శాతానికి త‌గ్గించాయి. 2017 నుంచి ఇన్ఫీ 10వేల మంది స్థానికుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డం గ‌ుర్తించదగిన అంశంగా చెప్పవచ్చు.

 

ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్ ....వీసాల ర‌ద్దు ప్ర‌భావాన్ని ప‌రిమితం చేసింద‌ని చెబుతున్నారు. మూడు నెల‌లుగా అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు త‌గ్గిపోయాయి. భార‌త్ నుంచి ఏ దేశాల‌కూ విమానాలు న‌డ‌వ‌డం లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇదే ప‌రిస్థితి. ఎక్క‌డివారు అక్క‌డే ఉన్నారు. 2021 పూర్త‌య్యే వ‌ర‌కూ ఇలాగే ఉంటుంద‌ని అంచ‌నా!  గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ కంపెనీల‌న్నీ ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు ఇంట్లో నుంచే ప‌నిచేసేందుకు అనుమ‌తులు ఇచ్చేశాయి. భార‌తీయ కంపెనీలూ ఇదే విధానాన్ని అవ‌లంబిస్తున్నాయి. ఇత‌ర ప్రాంతాల్లోని ప్రాజెక్టుల‌న్నీ రిమోట్ విధానం ద్వారానే పూర్తి చేస్తున్నాయి. కాబ‌ట్టి వీసాల ర‌ద్దు ప్ర‌భావం త‌క్కువేఅంటున్నారు నిపుణులు.

 

ప్ర‌స్తుతం వ్యాపారాల‌కు కష్టకాలం.. కంపెనీలు గ‌డ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గిరాకీ త‌గ్గింది. దాదాపు అన్ని ఐటీ కంపెనీల డాల‌ర్ ఆదాయం ప‌డిపోయింద‌ని ఎమ్. కే గ్లోబ‌ల్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ లిమిటెడ్ తెలిపింది. డిమాండ్ కుంచించుకుపోవ‌డంతో క్ల‌యింట్లు ఖ‌ర్చులను త‌గ్గించారు. ఉద్యోగాల్లో కోత విధిస్తున్నారు. కొత్త‌గా ఎంత‌మందిని తీసుకోవాల‌న్న దానిపై ప‌రిమితి విధించుకున్నార‌ని ఎమ్‌కే గ్లోబ‌ల్ పేర్కొంది. ఉద్యోగాలే త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు వీసాలూ ప‌రిమితంగానే అవ‌స‌రం.  అమెరికాలో నిరుద్యోగం పెర‌గ‌డం,  కొత్త ప్రాజెక్టులు సైతం ఆల‌స్య‌మ‌వుతుండ‌టంతో హెచ్‌-1బి వీసాల అవ‌స‌రం త‌క్కువేన‌ని నొమురా అంచ‌నా వేసింది. 

 

వీసాల నిలిపివేత నిర్ణ‌యాన్ని ప్ర‌ముఖులు వ్య‌తిరేకిస్తున్నారు. 'అమెరికా ఆర్థిక విజ‌యాలు, శాస్త్ర సాంకేతిక‌త‌లో ప్ర‌పంచ అగ్ర‌గామిగా ఎద‌గ‌డానికి, గూగుల్ కంపెనీ ఇలా ఉండేందుకు వ‌ల‌స విధాన‌మే కార‌ణమన్నారు పిచాయ్...  వీసాల తాత్కాలిక ర‌ద్దు నిర్ణ‌యం నిరాశ‌ప‌రిచింది. అంద‌రికీ అవ‌కాశాలు ద‌క్కేలా వ‌లసజీవుల‌కు  అండ‌గా నిల‌బ‌డ‌తామన్నారు పిచాయ్. ఎల‌న్ మ‌స్క్ సైతం ట్రంప్ నిర్ణ‌యంపై పెద‌వి విరిచారు. 'ఈ చ‌ర్య‌ను నేను అంగీక‌రించ‌డం లేదు. వ‌ల‌స‌ నైపుణ్యాలే కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయ‌ని నా అనుభ‌వం చెప్పింది. వీసా సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మే  కానీ ఇలా కాదు అని ఆయ‌న పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: