అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థతో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన నాటి నుంచి దేశం మొత్తం జగన్ పేరు మారిమోగిపోతోంది. ఇక కొంతమంది జగన్ కు మద్దతుగా నిలుస్తోంటే.. మరికొంతమంది ఈ లేఖపై మండిపడుతున్నారు. తాజాగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గురిజాల కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. వ్యక్తుల కంటే వ్యవస్థలే గొప్పవని, ఆ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గురిజాల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. చిరుద్యోగి అయినా, ఉన్నతోద్యోగి అయినా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని.. వారికి అనుమానాలు, సందేహాలు కలిగేలా వ్యవస్థలోని పెద్దలు వ్యవహరించకూడదన్నారు.

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, నలుగురు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారసహితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇటీవల ఫిర్యాదు చేయడం తదితర అంశాలపై జస్టిస్‌ కృష్ణమోహన్‌రెడ్డి ఓ మీడియా చానల్ తో  ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే విందాం.. సీఎం జగన్‌ సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిపై ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు ఆధారాలను సమర్పించారు. వాటిపై సీజేఐ స్పందించి విచారణ జరిపించాలి. ప్రాథమిక ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి. సీఎంవి ఆరోపణలు అంటున్నాం. కాబట్టి విచారణ జరిపితే అవి ఆరోపణలా? లేక వాస్తవాలా అన్నది తేలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే కదా. ప్రజాస్వామ్య పరిరక్షణలో కోర్టులది చాలా ముఖ్య భూమిక. న్యాయస్థానాలు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే.. సమాజంలో చెడును నియంత్రించడంలో వాటిది కీలకపాత్ర. మనస్సులో ఏదో పెట్టుకుని చేస్తున్నాయన్న భావన, అనుమానాలు ప్రజల్లో కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంది. దీనివల్ల వ్యవస్థ ప్రతిష్ట పెరుగుతుంది. న్యాయస్థానాలు సరిగ్గా ఉన్నప్పుడు  తప్పులు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: