కరోనా కారణంగా రేషన్ దుకాణాల్లో తీసుకునే సరకులను పూర్తి ఉచితంగా అందిస్తూ వచ్చాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. నవంబరుతో కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీ పూర్తి కాబోతోంది. అయితే కరోనా కష్టాలు ఇంకా తీరలేదనే ఉద్దేశంతో, పేదలను ఆదుకునేందుకు ఈ ఉచిత బియ్యం పథకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనే ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకంపై చూచాయగా ప్రకటన చేశారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అందుకే ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కేంద్రం ఇచ్చే బియ్యానికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వాలు కందులు, శెనగలు.. ఇలా ఒక్కో నెల ఒక్కో రంకం పంపిణీ చేస్తోంది. ఇప్పుడు కేంద్రం పొడిగింపు నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం కూడా ఇలా ఉచితంగా ఇచ్చే సరకుల పంపిణీ పొడిగించాల్సి ఉంటుంది.
అయితే కేంద్రం మదిలో మరో ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని ఇకపై ఎప్పటికీ ఉచితంగానే ఇచ్చేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్ర ప్రభుత్వాలపై పూర్తి స్థాయిలో భారం తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ కేంద్రం సబ్సిడీపై ఇచ్చే రేషన్ బియ్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కేజీ రూపాయికే పేదలకు అందిస్తోంది. కరోనా లాక్ డౌన్ కాలంలో కేంద్రం ఇచ్చే బియ్యానికి అదనంగా రాష్ట్రం రేషన్ బియ్యాన్ని కూడా సమకూరుస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ఉచితంగా బియ్యం ఇస్తామని చెబితే, రాష్ట్రం తమ వాటాను పక్కనపెట్టే అవకాశముంది. అంటే రాష్ట్రం తరపున సబ్సిడీ భరించాల్సిన సమస్య తప్పుతుంది.

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం గడువు నవంబర్ తో ముగుస్తుండగా.. దాన్ని మార్చి వరకు పొడిగించే నిర్ణయం త్వరలోనే కేంద్రం తీసుకుంటుంది. ఉచిత బియ్యం పంపిణీ కొనసాగించాలంటూ వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులోనూ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే మొదలయ్యాయి. రాజకీయ కోణంలో కూడా ఉచిత బియ్యం పంపిణీ తమకు లాభంగానే భావిస్తోంది కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: