ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ఆందోళనకర రీతిలో వ్యాపిస్తోంది. పలు దేశాల్లో కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. నెల క్రితం వరకు కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు..అక్టోబరు మధ్య నుంచి మళ్ళీ ఒక్కసారిగా అధికమవుతున్నాయి. వైద్యుల హెచ్చరికతో పలు దేశాల ప్రభుత్వాలు మరోసారి ఆంక్షలు  విధిస్తే.. మరికొన్ని విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.6 కోట్ల మందికిపైగా వైరస్‌ సోకింది. వారిలో 11.9 లక్షల మందికిపైగా మృతిచెందారు.

యూరప్‌లో కరోనా కేసుల సంఖ్య కోటి మార్కును దాటింది. వైరస్‌ వ్యాప్తికి ఐరోపా మరోసారి కేంద్ర బిందువుగా మారింది. వారం రోజుల వ్యవధిలోనే 30 శాతం మరణాలు పెరిగాయి. రెండో దఫా కరోనా విజృంభణతో వణికిపోతున్న ఫ్రాన్స్‌ మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. కొవిడ్‌ బాధితులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. నగర వీధులన్నీ వెలవెలబోయాయి. ఫ్రాన్స్‌లో రెండో దఫా విజృంభించిన కరోనా మహమ్మారితో పోరాడేందుకు నాలుగు వారాలపాటు లాక్‌డౌన్‌ విధించడమే దీనికి కారణం.నిత్యావసర వస్తువులను పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవడానికి ప్రజలు ప్రయత్నించడంతో వాటికి సంబంధించిన దుకాణాలు మాత్రం రద్దీగా కనిపించాయి. ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో నగరం వెలుపలకు దారితీసే రహదారుల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.

జర్మనీ సైతం మళ్లీ లాక్‌డౌన్‌ విధించేందుకు సిద్ధమవుతోంది. బెల్జియం, ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌, ఐర్లాండ్‌, పోలండ్‌ దేశాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. భారత్‌లో మాత్రం క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటలీలోనూ కొవిడ్‌ పంజా విసురుతోంది. 24 గంటల వ్యవధిలో 30 వేలకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 6 లక్షలు దాటింది.

కరోనా కేసుల పరంగా తొలి స్థానంలో ఉన్న అమెరికాలోనూ వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది.  ఒక్కరోజే రికార్డు స్థాయిలో 90 వేల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. బాధితుల సంఖ్య 93 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 2.35 లక్షలు దాటింది. బ్రెజిల్‌లో వైరస్‌ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఒక్కరోజులోనే 30 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: