గ్రేటర్ ప్రచారం ముంగింపు పర్వానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బీజేపీ అభ్యర్థుల తరపున ర్యాలీ చేపట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అదే సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు భయపడుతున్నారు.

హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు కొదవ లేదు. చిన్న చిన్న నాళాలు సహా.. ఏకంగా మూసీ నదిలోనే ఆక్రమణలు ఉన్నాయి. ఇక చెరువులు, రోడ్డు ఆక్రమణల సంగతి చెప్పేదేముంది. అయితే వీరంతా పేదవారు, ఎలాంటి ఆశ్రయం లేనివారు. ఆక్రమణలు తొలగించండి అని చెప్పొచ్చు కానీ, బలవంతంగా వారిని తరలించలేని పరిస్థితి. పోనీ ఆక్రమణలు తొలగిస్తే వారికి ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంటుంది. బలవంతపు ఆక్రమణల తొలగింపు అనేది పార్టీలకు ఎప్పుడూ తలనొప్పే. అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా ఆక్రమణల జోలికి మాత్రం వెళ్లలేకపోయారు, వెళ్లలేరు కూడా.

అదే సమయంలో హైదరాబాద్ లో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కూడా ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. కేవలం కాల్వలు, చెరువులు ఆక్రమించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది బహిరంగ రహస్యం. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్లే హైదరాబాద్ వరదలకు 7లక్షలమంది నష్టపోయారు. అయితే ఇప్పుడు వరదలు తగ్గిపోయాక అందరూ ఆ వ్యవహారం గురించి మరచిపోయారు. ప్రజా జీవనం మళ్లీ యధావిధిగా మొదలైంది. బీజేపీ నాయకులు మాత్రం హైదరాబాద్ లో ఆక్రమణలు తొలగిస్తామంటూ హామీ ఇచ్చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా.. బలవంతంగానైనా ఆక్రమణలు తొలగిస్తామని తేల్చి చెప్పారు. తమకు అధికారం వస్తే అక్రమ నిర్మాణల తొలగింపులో ఉదాసీనంగా ఉండబోమని చెప్పిన అమిత్ షా.. ఒకరకంగా వారందరినీ కలవర పెట్టినట్టయింది. అక్రమ నిర్మాణాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా బీజేపీకి వ్యతిరేకంగా మారిపోయే ప్రమాదం ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే తమ ఇళ్లు, నిర్మాణాలు, స్థలాలు పోతాయనుకునేవారు వారిని ఎందుకు గెలిపిస్తారు? అందరికీ ఈ సమస్యలేదు కానీ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీజేపీ అభ్యర్థులు భయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: