శేరిలింగం పల్లి డివిజన్‌లో బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. నోటిఫైడ్ స్లమ్స్ ఎక్కువగా ఉన్న డివిజన్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ  స్లమ్స్‌ ను గుర్తించాయి. కానీ మౌలిక వసతుల కల్పనలో మాత్రం ముందుకు రాలేదు.
శేర్‌లింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో మరో డివిజన్ మియాపూర్‌. ఇక్కడ 56వేల మంది ఓటర్లున్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మేక రమేష్ విజయం సాధించారు. ఆయన చనిపోవడంతో ఈసారి శ్రీకాంత్‌కు టికెట్‌ ఇచ్చారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో గతంలో టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ డివిజన్‌లోని బస్తీలను చూస్తే అసలు ఇవి గ్రేటర్లోనే ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుంది. మియాపూర్ డివిజన్ ఓల్డ్ బాంబే హైవేకు ఆనుకుని  ఉంటుంది. మియాపూర్లో  తొమ్మిది బస్తీలున్నాయి.

శేరిలింగంపల్లిలో మరో డివిజన్‌ కొండాపూర్‌. ఈ డివిజన్‌లో 76వేల మంది ఓటర్లున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలకే కాదు.. కంపుకొట్టే బస్తీలకూ అడ్డా కొండాపూర్‌. బడాబడా ఐటీ, ఎంఎన్‌సీ కంపెనీలున్న చోట ఎన్నో మురికివాడలు. గత ఎన్నికల్లో టీడీపీపై టీఆర్‌ఎస్ అభ్యర్ధి హమీద్ పటేల్ ఇక్కడ విజయం సాధించారు.  

కొండాపూర్ డివిజన్లో హైటెక్ హంగులెంతుంటాయో.. స్లమ్స్‌ కూడా అంతే ఉన్నాయి. అంజయ్యనగర్, సిద్ధిఖ్‌నగర్ బస్తీల్లో అడుగడుగునా డ్రైనేజీ గుంతలు. రోడ్ల నిండా మురికినీరు.. చెత్తా చెదారమే దర్శనమిస్తుంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 110వ డివిజన్‌ చందానగర్‌. ఒకప్పుడు పసుపు జెండా రెపరెపలాడిన చందానగర్‌ గడ్డపై ఇప్పుడు గులాబీ జెండా ఎగురుతోంది. గత ఎన్నికల్లో నవతారెడ్డి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా గెలుపొందారు. కానీ.. ఈ సారి టికెట్‌ దక్కించుకోలేకపోయారు. సిట్టింగ్‌లలో సీటు కోల్పోయిన వారిలో నవతారెడ్డి కూడా ఒకరు. చందానగర్‌లో 59 వేల మంది ఓటర్లుండగా..ఏడు బస్తీలున్నాయి. గ్రేటర్‌లో రియాల్టీ పరుగులు పెడుతున్న ఏరియాల్లో చందానగర్‌ ఒకటి.

హఫీజ్‌పేట డివిజన్ల్లో బస్తీలు కాలనీలు ఎక్కువ.ఇక్కడ ముస్లీంప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో .. ఏడు డివిజన్లలో ఈ సారి హోరాహోరీ పోరు జరగబోతుంది. సీమాంధ్రుల ప్రభావం ఎక్కువ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇది ఒకటి కావడంతో ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందోననే ఆసక్తి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: