పాట్నా: బిహార్ ప్రభుత్వంపై ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తీవ్రమైన విమర్శలు చేసింది. బిహార్ రాష్ట్రంలో ప్రభుత్వం లాంటిదేమీ లేదని, అక్కడి కార్యనిర్వాహక శాఖ నుంచి కూడా దీనిపై ఎటువంటి వివరాలూ వినిపించడం లేదని చురకలు వేసింది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జేడీయూ - బీజేపీ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కూటమిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్.. బుధవారం నాడు విమర్శల వర్షం కురిపించింది.

రాష్ట్ర రాజధాని పాట్నాలో ఇండిగో ఎయిర్‌ లైన్స్ మేనేజర్ రూపేష్ కుమార్ హత్య జరగడం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆర్జేడీ.. ఈ విధంగా స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆర్జేడీ పాలనను జంగల్ రాజంటూ విమర్శలు గుప్పించిన జేడీయూ, బీజేపీ పార్టీలు ఇప్పుడు చేస్తున్నదేంటని? ఆర్జేడీ నేతలు తూర్పార పట్టారు. ప్రస్తుత అధికార కూటమి.. ప్రభుత్వ వ్యవస్థలను అడవుల్లోకి నెట్టేస్తోందని విమర్శలు గుప్పించారు.


బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్జేడీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ ఝా.. అధికార కూటమిపై నిప్పులు చెరిగారు. ‘‘బిహార్‌లో శాంతి భద్రతల గురించి మీరు పదే పదే ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ఇక్కడి ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇంతకు ముందు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఢిల్లీలో నేరస్థుల ముందు మోకరిల్లారు. ప్రస్తుత ముఖ్య మంత్రి, ఉప ముఖ్య మంత్రులకు శాంతి భద్రతలు వంటి ముఖ్యమైన విషయాలేవీ పట్టవు. ఎయిరిండియా మేనేజర్‌పై కాల్పులు జరిపి హత్య చేస్తే వారు ఒక్క మాటైన మాట్లాడలేదు చూశారా? కనీసం గవర్నర్ అయినా చొరవ తీసుకుని రాష్ట్ర పరిస్థితిని కేంద్రానికి వివరిస్తే మంచిది. ఇక్కడ ప్రభుత్వం వంటిదేమీ ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని అన్నారు.

ప్రస్తుతం బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈ హత్య.. దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. బిహార్ ప్రభుత్వం ఏం చేస్తోందని కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: