ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా గడ్డపైనే ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అది కూడా ఆ దేశానికి కంచుకోటైన గాబా పిచ్‌పై ఆసీస్‌ను మట్టికరింపించింది మరపురాని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో టీమిండియాతో పాటు భారత క్రికెట్ అభిమానులంతా ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. టీమిండియా గెలుపు ఆనందాన్ని ఆస్వాదిస్తున్న ఈ సమయంలోనే ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ ఓ వార్నింగ్ ఇచ్చాడు. అసలైన టెస్ట్ ముందుందని, ఇంగ్లండ్‌ను ఓడించడం ఆషామాషీ కాదనే విధంగా ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఈ విజయం టీమిండియాకు దక్కింది. ఇదో చారిత్రాత్మక విజయం. ఇది నిజంగా వేడుక చేసుకోవాల్సిందే. అయితే మరికొద్ది వారాలో అసలైన జట్టు ఇంగ్లాండ్ భారత్‌కు రానుంది. వారిని మీ సొంత గడ్డపై ఓడించి నిరూపించండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రెండు వారాల్లో ఎక్కువగా సెలబ్రేషన్స్ చేసుకోకండి’ అంటూ హెచ్చరించాడు. ఆసీస్‌పై గెలిచి విజయానందంలో ఉన్న టీమిండియాకు పీటర్సన్ వార్నింగ్ ఇవ్వడంపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఇలాగే అహంకారానికి పోయారని, వారిని తమ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు మట్టికరిపించారని, ఇంగ్లాండ్‌కు కూడా అదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నారు.

అయితే అంతకుముందు ఆసీస్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు పీటర్సన్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. ముఖ్యంగా చివరివరకూ పిచ్‌పై పాతుకుపోయి జట్టును విజయతీరాలకు చేర్చిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌పై పీటర్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే పంత్ పిల్లాడి నుంచి వ్యక్తిగా మారాడంటూ చమత్కరించాడు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేల్లో ఇరు జట్లూ తలపడనున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: