కరోనా సోకిందని ఇంట్లో అద్దెకుండేవారిని రోడ్డున పడేస్తున్న యజమానులను చూస్తూనే ఉన్నాం.. కుటుంబ సభ్యులమధ్యే మంట గలుస్తున్న మానవత్వాన్ని తెలుసుకుంటూనే ఉన్నాం.. కానీ వెంకట్రావులాంటివారు సమాజంలో ఇంకా ఉండటంవల్లే మానవత్వం వెల్లివిరుస్తుందనుకోవచ్చు.. కరోనా లాంటి విపత్తులు ఎన్నివచ్చినా గుండె ధైర్యంతో ఎదుర్కోవచ్చనే ఆత్మవిశ్వాసాన్ని ఇలాంటివారు సమాజానికి కల్పిస్తున్నారు. కరోనా పాజిటివ్ తో ఉన్న గర్భిణీకి తన అంబులెన్స్ లో పురుడు పోసి త‌ల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడారు. అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు.

అంబులెన్స్ లోనే కాన్పు
వెంకట్రావు అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన రోగులను తన అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలిస్తుంటారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన జి.కల్యాణి కాన్పు కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ప్రసవ సమయంలో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వైద్యులు వరంగల్ ఎంజీఎంకు సిఫార్సు చేశారు. గురువారం ఉదయం ప్రభుత్వాస్పత్రికి చెందిన అంబులెన్స్ లో కల్యాణిని వరంగల్‌కు పంపించారు. తిరుమలాయపాలెం దాటిన తర్వాత కల్యాణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంట‌నే అంబులెన్స్ ను ప‌క్క‌కు నిలిపిన వెంక‌ట్రావు  సమయస్ఫూర్తిగా వ్యవహరించి బిడ్డను బయటకు తీశారు.

మాతా, శిశు సంర‌క్ష‌ణ కేంద్రానికి త‌ర‌లింపు
ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన క‌ల్యాణిని వెంక‌ట్రావు వెంటనే ఖమ్మంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకువ‌చ్చారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, క‌ల్యాణికి  ప్రత్యేకంగా కొవిడ్ చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు వెల్ల‌డించారు. విపత్కర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రసవం చేసిన డ్రైవర్ వెంకట్రావును వైద్యులు, వైద్య సిబ్బంది, మాతా, శివుసంర‌క్ష‌ణ కేంద్రం అధికారి అభినందించారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అన్నివ‌ర్గాల నుంచి వెంక‌ట్రావుపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. పురుడు పోయ‌డానికి ప్ర‌భుత్వ వైద్యులే వెన‌కాడి వ‌రంగ‌ల్ ఆసుప‌త్రికి రిఫ‌ర్ చేశార‌ని, క‌రోనా గురించి భ‌య‌ప‌డ‌కుండా వైద్యుల‌కంటే మిన్న‌గా క‌ల్యాణికి చికిత్స‌నందించారంటూ వెంక‌ట్రావుపై అభినంద‌న‌ల వ‌ర్షం కురుస్తోంది. భ‌యంవ‌ల్లే చాలామంది క‌రోనాను జ‌యించ‌లేక‌పోతున్నార‌ని, ఏ భ‌యం లేకుండా కాన్పుచేసిన వెంక‌ట్రావులాంటివారిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: