అమరావతి : వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు.  రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని...పండించే పంటకీ, తినే తిండికీ పార్టీ రంగులు పులమడం దిగజారుడుతనమేనని ఫైర్‌ అయ్యారు.  రైతుల నుంచి ధాన్యం కొని నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వరా? నెలాఖరులోగా ప్రతి గింజకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇవ్వని పక్షంలో రైతుల కోసం పోరాడతామన్నారు.  కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకొన్న దళారులు గురించి విన్నామని... దళారులను మించిపోయి రైతులను రోడ్డు మీదకు తెచ్చిన ప్రభుత్వాన్ని చూస్తున్నామని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌.  

రూ.3 వేల కోట్లకుపైగా వరి పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిందని...ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి నిరుద్యోగులను ఎలా మోసపుచ్చారో... అదే విధంగా రైతన్నలను కూడా నమ్మించి మోసం చేశారని నిప్పులు చెరిగారు.   ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతు ఖాతాకు డబ్బు జమ చేస్తామని చెప్పారని... పాలనలోకి వచ్చిన తొలినాటి నుంచి నేటి వరకూ వైసీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వడంలో విఫలమవుతూనే ఉందని మండిపడ్డారు.  రబీ సీజన్లో కొన్న ధాన్యానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లోనే రూ.1800 కోట్లు వరకూ రైతులకు బకాయిలు ఉన్నాయని పేర్కొన్న పవన్‌ కళ్యాణ్‌.... ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను  ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

కొనుగోలు, బకాయిల విషయంలో ప్రభుత్వం గోప్యత ఎందుకు పాటిస్తోంది? అని ప్రశ్నించారు పవన్‌. తమ కష్టార్జితం కోసం అడిగిన రైతులను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు దూషించి, బెదిరించడం దుర్మార్గమని... నెలాఖరులోగా రైతుల బకాయిలు చెల్లించని పక్షంలో రైతులకు జనసేన పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని హెచ్చరించారు పవన్‌ కళ్యాణ్‌. జొన్న, మొక్క జొన్న కొనుగోలు విషయంలోనూ రైతులను పార్టీలవారీ విడదీయడం దురదృష్టకరమని... అధికార పార్టీకి మద్దతుగా ఉన్నవారి నుంచే పంటను కొన్నారని నిప్పులు చెరిగారు.

 రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను అందించడంలోనూ పార్టీ లెక్కలే చూస్తున్నారని... నకిలీ విత్తనాలు, పురుగుల మందుల వ్యాపారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోంది? అని నిలదీశారు.  విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోలు‌ వరకు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని మండిపడ్డా పవన్‌ కళ్యాణ్‌.. జనసేన పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుంది... వారి కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: