పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌లో తెలుగుదేశం పార్టీ ఓటమిపై తమ్ముళ్లలో అంతర్మథనం కొనసాగుతోంది. తమ పార్టీ పరాజయం కావడానికి కారణాలు ఏమిటా అని వారు విశ్లేషించుకుంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ మళ్లీ పుంజుకుంటున్న సమయంలో.. పార్టీ శ్రేణులన్నీ ఒకేతాటిపైకి వస్తున్న వేళ.. కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమనుకున్నవారికి.. ఊహించనివిధంగా అపజయం ఎదురవడంతో జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఓటమికి కారణాలను ఆరా తీస్తున్నారు. ఇందులో స్వపక్ష పార్టీ నాయకుల స్వయం కృతాపరాధాలతో పాటు అధికార వైసీపీ మాయ కూడా ఉందని తెలుగుతమ్ముళ్లలో చర్చ జరుగుతోంది.

నిజానికి ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు మొదటి నుంచి వివాదస్పదంగానే మారాయి. ఏలూరు నగరంలో చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలను ఎన్నికలకు ముందు విలీనం చేశారు. తర్వాత డివిజన్ల పునర్విజన చేశారు. ఇక్కడే అధికార పార్టీ తన మాయ చూపించిందని టాక్. డివిజన్ల పునర్విభజనన తనకు అనుకూలంగా చేసుకుందనేది ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. తెలుగుదేశం పార్టీ బలీయంగా ఉన్న  డివిజన్లను విచ్చిన్నం చేసి, అక్కడ గందరగోళం సృష్టించి, డివిజన్ల పునర్విభజనను పూర్తి చేసిందన్న విమర్శలున్నాయి. అప్పట్లో అన్నిరకాలుగా అభ్యంతరాలను వ్యక్తం చేసినా, వాటినేమి అధికార పార్టీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీకి మొత్తం 50 డివిజన్‌లలో ఏకంగా 47 స్థానాలు దక్కాయి. టీడీపీ మూడు డివిజన్‌లకు మాత్రమే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత.. ఏలూరులో ఈ స్థాయిలో ఓటమి ఎదురవడం ఇదే ప్రథమమని స్వపక్ష నాయకులే చెబుతున్నారు.

ఇక ఓటర్ల జాబితాలు అస్తవ్యస్తంగా తయారు చేయడం మరో కారణమని టీడీపీ నేతలు చెబుతున్నారు. డివిజన్‌ల పునర్విభజన కారణంగా చాలామంది ఓటర్లు ఓటు వేయడానికి రాలేదని తెలిపారు. అలాగే టీడీపీ అభ్యర్ధుల తప్పిదాలు కూడా వైసీపీకి కలిసొచ్చాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించడంలో పార్టీ అభ్యర్ధులు విఫలమవడం, ప్రచార సమయంలో దూకుడుగా వ్యవహరించకపోవడం లాంటి కారణాలు టీడీపీకి ఘోర ఓటమి తెచ్చిపెట్టిందని అంటున్నారు. టీడీపీ బలంగా ఉన్న డివిజన్లలోనూ వైసీపీ అభ్యర్థులు గెలవడానికి.. ఆయా డివిజన్లలోని తెలుగుదేశం అభ్యర్థుల అతి భయమే కారణమని చెబుతున్నారు. ఏదిఏమైనా ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి ఎన్నడూ లేనివిధంగా ఎదురైన ఫలితాలు గుణపాఠం లాంటివని పార్టీ నేతలే అంటుండటం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: