తెలంగాణలోని రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు మొదలైనప్పటికీ.. ఈ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు వినే భాగ్యం దక్కడం లేదు. హాస్టళ్లకు మోక్షం లభించకపోవడంతో చదువులో వెనుక పడిపోతున్నారు. హైకోర్టు ఇచ్చిన వారం గడువు ముగిసి రెండు వారాలు అవుతోంది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు మార్గదర్శకాలను విడుదల చేయలేదు. విద్యాసంస్థలు ప్రారంభించి 15 రోజులు గడిచిపోయాయి. అయినప్పటికీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల విషయాన్ని ప్రభుత్వం తేల్చడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు.
 
రాష్ట్రంలో 910 గురుకులాలు, 475 కేజీబీవీలు, 55 డిగ్రీ గురుకులాల్లో సుమారు 6,82,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే చర్చ జరుగుతోంది. గ్రామాల్లోని విద్యార్థులకు నెట్ సదుపాయం లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో రెసిడెన్షియల్ విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఇంటర్ పరీక్షల గండం కూడా వెంటాడుతోంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను చేపట్టింది. అయితే ప్రత్యక్ష  తరగతులకు హాజరుకాని తాము అకస్మాత్తుగా నిర్వహించే పరీక్షలను ఎలా రాయాలని విద్యార్థులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తే రెసిడెన్షియల్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఘోరంగా పడిపోతుందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రభుత్వ విధానాలతో  తీవ్ర అన్యాయం జరుగుతోందని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుని పదవ తరగతితోపాటు ఇంటర్, డిగ్రీ కళాశాలల రెసిడెన్షియల్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని కోరుతున్నాయి. పరిస్థితులకు తగినట్టు  మిగతా తరగతులను నిర్వహించాలని పలువురు  సూచిస్తున్నారు. వెంటనే రెసిడెన్షియల్ విద్యా సంస్థలను తెరవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: