ఐక్యరాజ్య స‌మితి స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో క‌శ్మీర్ అంశాన్ని లేవ‌నెత్తిన పాకిస్తాన్‌కు చుర‌క‌లంటించింది భార‌త్‌. ఉగ్ర‌వాదుల‌కు స్వ‌ర్గ‌ధామంగా పాకిస్తాన్ ఉంద‌ని.. ‘ఇంటికి నిప్పు పెట్టి న వ్య‌క్తి తిరిగి ఆ మంటల్ని ఆర్పేలాగా పాక్ ప్ర‌వ‌ర్త‌నా తీరు ఉంద‌ని` పాక్‌ను దుయ్య‌బ‌ట్టింది భార‌త్‌. ఉగ్ర‌వాదుల‌కు స్వ‌ర్గ‌ధామంగా ఉన్న పాకిస్తాన్ తీరు వ‌ల్ల ప్ర‌పంచం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొంది.

 
      ఐరాస స‌భ‌లో భార‌త అంత‌ర్గ‌త విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డంతో ఐరాస లో భారత ప్రతినిధి స్నేహా దూబే ధీటు స‌మాధానమిచ్చారు. భార‌త అంత‌ర్గత విష‌యాల‌ను మాట్లాడి ఈ వేదిక ప్ర‌తిష్ట‌ను త‌గ్గించారని మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలో వారికి బ‌దులిచ్చే హ‌క్కును ఉపయోగించుకుంటున్నామ‌న్నారు. అంతర్జాతీయ వేదికపై అవాస్తవాలతో విషం చిమ్మేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది అని ఆరోపించారు. దీని వ‌ల్లే నిజాల్ని ప్రపంచం ముందుంచాలనుకుంటున్నాం అని పైగా పదే పదే అవాస్తవాలు వల్లెవేస్తున్న నాయకుడి మానసిక స్థితిపై మనమంతా జాలిచూపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎద్దేవా చేశారు.


   తమని తాము ఉగ్రవాద బాధిత దేశంగా పాకిస్థాన్‌ చెప్పుకుంటూ న‌టిస్తోంద‌న్నారు. ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న దేశంగా  పాక్‌ను ఈ ప్రపంచం చూస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. పైగా వారి దేశంలోని వేర్పాటువాద ఉద్యమాల్ని ఉగ్రవాద చర్యలుగా చిత్రీకరిస్తోంది అని దూబే  పేర్కొంది. అలాగే, అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ పై జ‌రిగి ఉగ్రదాడిని ఈ సందర్భంగా భారత్‌ ప్రస్తావించింది. ఇంత ఘోరానికి పాల్ప‌డిన ఉగ్ర‌వాది ఓసామా బిన్ లాడెన్‌కు ఆశ్ర‌య‌మిచ్చింది పాకిస్తాన్ కాదా అని గుర్తు చేసింది.


     పాక్‌ సహా పొరుగు దేశాలన్నింటితో భారత్‌ సత్సంబంధాలనే కోరుకుంటోందని  ప్ర‌పంచ వేదిక‌గా  స్పష్టం చేశారు దూబే. అయితే, పాక్‌ ఆ దిశగా చొరవచూపాల్సిన అవసరం ఉందని సూచించారు ఆమె. ఉగ్రవాద నిర్మూలనకు విశ్వసనీయ, తిరుగులేని చర్యలు తీసుకోవాలన్నారు దూబే. ఐరాసలో ప్రసంగించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి రద్దు అంశాన్ని మ‌రోసారి ముందుకు తీసుకువ‌చ్చారు. దీనికి బ‌దులుగా దూబే పాక్‌కు చుర‌క‌లంటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

uno