అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ బిజీబిజీగా ఉన్నారు. హ్యూస్టన్ లో విమానం దిగినప్పటి నుంచీ.. వివిధ వర్గాల వారిని కలుస్తున్నారు. మొదట సీఈవోలతో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించిన మోడీ.. కశ్మీరీ పండిట్లు, సిక్కు సంఘాల ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. 


అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పలు ఇంధన కంపెనీల సీఈవోలు హ్యూస్టన్‌ లో కలిశారు. పలు ఒప్పందాలు చేసుకున్నారు. అమెరికాకు చెందిన టెల్లూరియన్‌, భారత్‌ కు చెందిన పెట్రోనెట్‌ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఏడాదికి 5 మిలియన్‌ టన్నుల సహజవాయువు  కొనుగోలు చేస్తారు. 2020 మార్చి 31నాటికి ఈ లావాదేవీలు కొలిక్కి వస్తాయి. అమెరికా, భారత్‌ మధ్య ఉన్న వ్యాపార, పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. దాదాపు 16 చమురు కంపెనీల సీఈవోలు  ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


మోడీని హ్యూస్టన్‌ లో అక్కడి సిక్కు సంఘాలకు చెందిన ప్రతినిధులు కలిశారు.  సిక్కు సముదాయానికి చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేశామన్నారు ప్రధానిని కలిసిన ప్రతినిధులు. ముఖ్యంగా కర్తార్‌ పూర్‌ కారిడార్‌ ఏర్పాటు, గురునానక్‌ 550 జయంతి ఉత్సవాలపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని వారు ప్రశంసించారు. 


హ్యూస్టన్‌ లోని కశ్మీరీ పండిట్లు, బొహ్రా ముస్లిం ప్రతినిధులు కూడా ప్రధాని మోడీని కలిశారు. జమ్మూ కశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు పట్ల కశ్మీరీ పండిట్లు కృతజ్ఞతలు తెలియజేశారు. కశ్మీర్‌ విషయంలో ప్రధాని తీసుకునే నిర్ణయాలకు అండగా ఉంటామని చెప్పారు. ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బావోద్వేగానికి లోనైన ఒక కశ్మీరీ పండిట్‌ మోడీ చేతిపై పలుమార్లు ముద్దులు పెట్టారు. అంతకుముందు కశ్మీరీ పండితులతో కలిసి నమస్తే శారదా దేవి శ్లోకాన్ని పలికారు. మోడీ మీద అభిమానంతో హ్యూస్టన్‌లోని ఒక చెఫ్‌, ప్రవాస భారతీయురాలు కిరణ్‌ వర్మ నమో తాలి పేరుతో భోజనాన్ని తయారు చేశారు. భారత్‌లో వివిధ రాష్ట్రాల్లో ప్రాచుర్యం చెందిన వంటలను ప్రధాని  మెనూలో చేర్చినట్టు కిరణ్ వర్మ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: