పింగళి వెంకట రామారెడ్డి. నేటి తరానికి చెందిన చాలా మందికి ఎక్కువగా అపరిచితమైన పేరు. భాగ్యనగరం చిత్రపటంపై చెరగని సంతకం ఆయనది. నిజాం ప్రభువుకు విశ్వాస పాత్రులై, హైదరాబాద్ నగరంపై తనదయిన ముద్ర వేసుకుని, ప్రజలకు అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించి ప్రజా శ్రేయస్సే ఏకైక లక్ష్యంగా, అంకిత భావంతో సేవచేసి అపారమైన ప్రేమాభి మానలను చూరగొన్న ప్రజాబంధువు ఆయన. నిజాం రాజుల ఏడు తరాల రాజ్య పాలనలో హైదరాబాదు నగర పోలీసు కమీషనర్ (కొత్వాల్) పదవికి నియమితులైన ప్రప్రథమ హిందువుగా చరిత్రలో మిగిలి పోయారాయన. వెంకట రామారెడ్డి (ఆగష్టు 22, 1869 – జనవరి 25, 1953) నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి.


నిజాం ప్రభువు వద్ద తమకు గల పలుకుబడి వల్ల ఎన్నో సంస్థలను స్థాపించారు. ఎన్నింటికో సాయం అందించారు. విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ నెలకొల్పారు.  1926లో “గోలకొండ పత్రిక” స్థాపనకు ముఖ్య కారకులయ్యారు. ఆ కాలంలో ఆయన వలన సహాయం పొందని తెలుగు సంస్థ లేదంటే అతిశయోక్తి కాదు. హరిజనోద్ధరణకు ఏర్పడిన సంఘాలకు, అనాథ బాలల ఆశ్రమాలు, కుష్టు నివారణ సంఘం జంతు హింసా నివారణ సమితి వంటి సంస్థలతో పనిచేసి, వాటికి ఉదారంగా ధన సహాయం చేశారు. ఈ క్రమంలోనే 1933లో రెడ్డి బాలికల హాస్టల్ (నారాయణ గూడ), 1954లో రెడ్డి మహిళా కళాశాల (నారాయణగూడ) లను ప్రారంభించారు. పింగళి సేవలకు గుర్తింపుగా నిజాం రాజు జన్మదినోత్సవం సందర్భంగా 1921లో “రాజా బహద్దూర్” అనే గౌరవం ఇచ్చారు.బ్రిటిష్ ప్రభుత్వం 1931లో ఆయనకు “ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్” గౌరవం ప్రదానం చేశారు.


 వెంకట రామారెడ్డి కాంస్య విగ్రహం హైదరాబాదులో నారాయణగూడ చౌరస్తాలో ప్రతిష్ఠించారు. వెంకట రామారెడ్డి పేరుతో హైదరాబాద్‌లో ఒక మహిళా కళాశాల స్థాపితమైంది. ఆయన పేరు మీద ట్రస్టును ఏర్పాటుచేసి, ఆ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్‌, సైబరాబాద్‌ మూడు కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న పోలీస్‌ అధికారులు విధుల్లో ప్రతిభ కనబర్చిన వారికి రాజాబహద్దూర్‌ వెంకట రామారెడ్డి అవార్డును అందజేస్తున్నారు. పధ్నాలుగు సంవత్సరాలు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసి, గ్రామీణ విద్యార్థుల చదువు కోసం రెడ్డి హాస్టల్‌ స్థాపించి, ఎందరో తెలుగువారు వెలుగులోకి రావడానికి కారకుడైన మహానుభావుడు కొత్వాల్‌ వెంకటరామారెడ్డి జనవరి 25 తేదీన 1953 సంవత్సరంలో పరమ పదించారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని దోమలగుడ ప్రాంతంలో ఆయన సమాధి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: