విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఆ మాటకు వస్తే... భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన క్రికెటర్ గానే కాకుండా... మోస్ట్ గ్లామరస్ పర్సన్ అనే పేరు కూడా కోహ్లీకి ఉంది. ఇంటర్ నేషనల్ క్రికెట్‌లో రన్ మెషిన్ అనే పేరు కోహ్లీ సొంతం. కోహ్లీ క్రీజ్‌లో ఉన్నాడంటే... మ్యాచ్‌పై ప్రత్యర్థి ఆటగాళ్లు ఆశలు వదులుకోవాల్సిందే. భారత అభిమానులు అయితే... కోహ్లీ ఉన్నాడా... అవుటయ్యాడా... అని అడిగేస్తారు. బెట్టింగ్ రాయుళ్లు కూడా కోహ్లీ ఉంటే ఒకలా... లేకపోతే మరోలా పందాలు కాసేస్తారు కూడా. పరుగుల యంత్రం అనే పేరున్న కోహ్లీ.... భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అదే సమయంలో కెప్టెన్‌గా పరిమిత ఓవర్లు మొదలు... టెస్టు క్రికెట్ వరకు... మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. అది ట్వంటీ 20 ఫార్మెట్ అయినా, వన్డే క్రికెట్ అయినా, టెస్ట్ మ్యాచ్ అయినా సరే... కోహ్లీ మాత్రం సక్సెస్‌కు అడ్రస్‌గా మారిపోయాడు. ఇక గ్లామర్ ఫీల్డ్‌లో కూడా కోహ్లీ టాప్ ప్లేస్‌లోనే ఉన్నాడు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే ఇండియన్ ప్లేయర్‌గా కోహ్లీ పేరు. మోడలింగ్ రంగంలో కూడా అదే స్థాయిలో ఉన్నారు కోహ్లీ.

అయితే ప్రస్తుతం కోహ్లీ టైమ్ ఏ మాత్రం బాగున్నట్లు కనిపించడం లేదు. తొలి నుంచి దూకుడుగా వ్యవహరించే కోహ్లీ... కొద్ది రోజులుగా పరుగులు చేసేందుకు నానా పాట్లు పడుతున్నాడు. అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో ఇప్పటికే 70 సెంచరీలు చేసిన కోహ్లీ... ఇప్పుడు కనీసం 20 పరుగులు చేసేందుకు కూడా తెగ ఇబ్బంది పడుతున్నాడు. వన్డేల్లో 2019 ఆగస్టు 14వ తేదీన వెస్టిండీస్ పైన సెంచరీ చేసిన కోహ్లీ... ఆ తర్వాత ఇప్పటి వరకు పెద్దగా ఆడిందే లేదు. 2021లో మూడు వన్డేలు మాత్రమే ఆడిన విరాట్... కేవలం 129 రన్స్ చేశాడు. ఇక టెస్టుల్లో కూడా సేమ్ సీన్. 2019 నవంబర్ 22వ తేదీన కోల్‌కతా టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. అది కూడా బంగ్లాదేశ్‌ పైన. ఆ తర్వాత ఇప్పటి వరకు నో సెంచరీ. గతేడాది అయితే.. 11 టెస్టులు ఆడిన కోహ్లీ... ఏకంగా నాలుగు సార్లు పరుగులు ఏమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. ఈ ఏడాది సౌతాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో మాత్రమే... 79 రన్స్ చేశాడు కోహ్లీ. ఇప్పటికే ట్వంటీ 20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న కోహ్లీని... వన్డే జట్టు సారధిగా బీసీసీఐ తొలగించింది. ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకోవడంతో... కోహ్లీ కెరీర్ ముగిసినట్లే అని అంతా భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: