సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ ని చూసి ఉండరు. మూడేళ్ళ బాలికను కిడ్నాప్ చేసి ట్రైన్ లో పారిపోతున్నాడో కిడ్నాపర్. పోలీసులు ఛేజ్ చేసి పట్టుకుందామంటే  అది సాధ్యం కాని పని. తర్వాతి స్టేషన్ లో రైలు దిగి పారిపోయే అవకాశం ఉంది. అందుకే ఆ అవకాశం లేకుండా ఒక ప్లాన్ వేశారు పోలీసులు. ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. చివరకి ఆ కిడ్నాపర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.



వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ లోని మూడేళ్ళ బాలికను అపహరించిన ఓ వ్యక్తి లలిత్ పూర్ రైల్వేస్టేషన్ లో భోపాల్ వెళ్ళే రైలు ఎక్కాడు. వెనకాలే అతన్ని వెంబడిస్తూ వచ్చిన ఆ బాలిక తల్లిదండ్రులు వాడు స్టేషన్ లోపలికి వెళ్ళడం గమనించారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, లలిత్ పూర్ రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. కిడ్నాపర్ ఆ బాలికను తీసుకుని రప్తిసాగర్ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. ఈ విషయం ఉన్నతాధికారులకు చెప్పడంతో వారు లోకో పైలట్ కి కిడ్నాప్ గురించి వివరించారు. రైలును ఎక్కడా ఆపకుండా భోపాల్ వరకూ నడపమని ఆదేశాలు జారీ చేశారు. అలా ఆ రైలు మధ్యప్రదేశ్ లోని లలిత్ పూర్ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ లోనూ ఆగకుండా సుమారు 243 కిలోమీటర్లు ప్రయాణించి చివరకి ఉత్తరప్రదేశ్ లోని భోపాల్ స్టేషన్ లో ఆగింది.



ఈలోపే లలిత్ పూర్ రైల్వే పోలీసులు భోపాల్ పోలీసులకు విషయం చెప్పి ఉంచడంతో పాటు బాలికతో పాటు ఉన్న కిడ్నాపర్ ఫోటోను వారికి పంపించారు. దీంతో భోపాల్ పోలీసులు అలర్ట్ అయ్యి ఆ రైలు భోపాల్ స్టేషన్ కు చేరుకోకముందే ఆ రైలు ఆగే ప్లాట్ ఫార్మ్ మీద ఎదురుచూస్తూ ఉన్నారు. రప్తిసాగర్ ఎక్స్ ప్రెస్ భోపాల్ స్టేషన్ ప్లాట్ ఫార్మ్ మీద ఆగగానే, పోలీసులు కంపార్ట్ మెంట్ లో వెళ్ళి కిడ్నాపర్ ను పట్టుకున్నారు. అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు, రైల్వే అధికారులు చేసిన ఈ పనికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: