దేశవ్యాప్తంగా మహిళలు అప్పుల్లో కూరుకు పోతున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాలిని భట్టాచార్య, మరియం ధావలే ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ చెప్పుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన పాలక పార్టీలు ప్రజలను, ప్రధానంగా మహిళలను తీవ్రంగా మోసం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక డ్వాక్రా రుణాలు భారీగా తీసుకుంటున్నారని, చెల్లించే స్తోమత లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదన పడిపోవడంతో పేద కుటుంబాలు సంక్షోభంలో కూరుకు పోతున్నాయని, దీంతో మహిళల కష్టాలు మరింత పెరుగుతున్నాయని వివరించారు.

రాష్ట్రంలో మహిళల ఉపాధి కోసం కెసిఆర్ సర్కార్  ప్రత్యేక పథకాలు రూపొందించలేదని గుర్తు చేశారు. బేటి బచావో, బేటి పడావో పథకం సక్రమంగా అమలు కావడం లేదని చెప్పారు. నిర్భయ ఫండ్ కు  రూ. వెయ్యి కోట్లు కేటాయించిన కేంద్రం, వాటిని ఇతర అవసరాలకు మళ్లీస్తున్నారని విమర్శించారు. సమాజంతో మనుస్మృతి ప్రభావం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాన హక్కుల కోసం పోరాటం చేస్తామనీ, రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని వివరించారు. మోడీ విధానాలనే కేసీఆర్ అనుసరిస్తున్నారని విమర్శించారు. సోమవారం జరిగే భారత్ బంద్ కు ఐద్వా  సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అందరూ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోడీ ఓటమే ఐద్వా ద్యేయమని వ్యాఖ్యానించారు.

మహిళల అభ్యున్నతి కోసం  ఐద్వాసాధ్యమైనంత మేరకు కృషి చేస్తుందని తెలిపారు. ఆకలి,విద్య,ఆహార భద్రత కోసం ఐద్వా పోరాడుతుందని చెప్పారు. దీనికోసం దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం చేపడతామని వివరించారు. మోడీ కేసీఆర్ ను ప్రజలు ఎన్నుకున్నారని, వారికి బాధ్యత వహించాలని కోరారు. ప్రజల పట్ల వారు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళలభద్రతకు, రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు తేవాలని విజ్ఞప్తి చేశారు. మహాసభల్లో చేసిన తీర్మానాల కాపీలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని వారు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: