శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామిక కారిడార్‌గా పేరొందిన పైడిభీమవరం ప్రాంతంలో అనేక పేరుగాంచిన రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే సిక్కోలులో పారిశ్రామిక అభివృద్ది ముసుగులో పర్యావరణ విధ్వంసమే జరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రణస్ధలం , ఎచ్చెర్ల మండలాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. ఈ రెండు మండలాల్లో నివసించే ప్రజలు నిత్యం భయం గుప్పిట్లోనే బతుకుతూ ఉంటారు. ఏ సమయంలో ఎలాంటి విపత్కర వార్త వినాల్సి వస్తుందో అన్న టెన్షన్ నిత్యం ఇక్కడి వాసులను వెంటాడుతూనే ఉంటుంది. పైడిభీమవరం ప్రాంతంలో ప్రస్తుతం కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయి. రసాయన పరిశ్రమలతో పాటు, ఫార్మా ఇండస్ట్రీలు ఎక్కువగా ఏర్పాటు చేయటంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. భూగర్బ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే పరిశ్రమలను కాకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతోమంది కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నా యాజమాన్యాలు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు నెలకొన్నాయి.

పైడిభీమవరం ప్రాంతంలో ఏర్పాటు అయిన అనేక పరిశ్రమలకు స్థానికులు భూములను త్యాగం చేశారు. స్ధానికులకు ఉపాధి కల్పించటంతో పాటు గ్రామాల్లో సీఎస్‌ఆర్‌ నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని యాజమాన్యాలు ఇచ్చిన హామీల కారణంగా ప్రజలు ఫ్యాక్టరీల ఏర్పాటుకు అంగీకరించారు. కానీ ప్రస్తుతం లాభాలను ఆర్జిస్తున్న యాజమాన్యాలు.. స్థానికుల బాధలు, ఇబ్బందులను కనీసం పట్టించుకోవటం లేదు. ప్రమాదాల మాట అటుంచితే.. స్దానికులకు ఇక్కడ ఉపాధి దొరకటం లేదు. ఫ్యాక్టరీల కోసం వేలాది ఎకరాలను త్యాగం చేసిన పరిసర గ్రామాల వారు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. మరోవైపు ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. దీనికితోడు గ్రామలకు దగ్గర్లో భారీగా బోర్లు వేయించి భూగర్భ జలాలను ఫ్యాక్టరీ అవసరాలకు తరలిస్తున్నారు. దీంతో వేసవి కాలంలో ఇక్కడి ప్రజలకు నీటి కష్టాలు తప్పటం లేదు. ఇక కాలుష్యం కారణంగా పంటలు దిగుబడి తగ్గటంతో పాటు ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు వ్యర్ధాల నియంత్రణపై అధికారులు దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతం స్మశానంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరి సిక్కులులో కోరలు చాచిన కాలుష్యం నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: